తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు ఏర్పడింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్‌ఐబి (SIB) మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఎట్టకేలకు విచారణకు హాజరవేందుకు సిద్ధమయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయన భారత్‌కి రానున్నట్లు సమాచారం. గత 14 నెలలుగా అమెరికాలో ఉన్న ఆయన, బుధవారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకుంటారని అధికారులు తెలిపారు.
సిట్ (SIT) విచారణకు గురువారం హాజరు కావాల్సి ఉన్నప్పటికీ, ప్రభాకర్ రావు ఇంకా సింగిల్ ఎంట్రీ పర్మిట్ తీసుకోలేదని సమాచారం. అయితే, పర్మిట్ తీసుకున్న తర్వాత మూడు రోజుల లోపు ఆయన విచారణకు తప్పనిసరిగా హాజరు కావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఇక ఇప్పటికే ఆయన భార్య హైదరాబాద్‌కు వచ్చినట్టు సమాచారం. ఒకవేళ ఆయన రాక ఆలస్యమైతే, న్యాయవాదులతో కలిసి మరుసటి రోజు సిట్ అధికారుల ఎదుట హాజరయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, హైకోర్టులో ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వనప్పటికీ, సుప్రీంకోర్టు తాత్కాలిక ఊరట కల్పించింది. అప్పటివరకు అరెస్ట్ చేయవద్దని, విచారణకు మాత్రం హాజరు కావాలంటూ స్పష్టం చేసింది.
ఒకప్పుడు పోలీస్ వ్యవస్థలో కీలక పదవిలో ఉన్న ప్రభాకర్ రావుపై విచారణ ప్రారంభం కావడం, ఈ కేసు దర్యాప్తులో కీలక మలుపుగా మారింది. ఈ నేపథ్యంలో ఆయనపై దర్యాప్తు అధికారులు ఎలా విచారణ జరుపుతారన్నది ఆసక్తికరంగా మారింది.
Read More : వియత్నాంలో తెలంగాణ విద్యార్థి దుర్మరణం

One thought on “ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు”
Comments are closed.