తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అంతర్గత గొడవలు తారా స్థాయికి చేరుకున్నాయి. కొత్త, పాత, సీనియర్లు, జూనియర్లు అనే విభజనలతో పార్టీ మరింత అస్తవ్యస్తంగా మారిపోయిందని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పటాన్‌చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ మూడు ముక్కలుగా చీలిపోయింది. కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గం, నీలం మధు వర్గం, గూడెం మహిపాల్ రెడ్డి వర్గంగా విడిపోయిన నేపథ్యంలో హస్తం పార్టీ నెమ్మదిగా శిధిలమవుతోందని అనేక నేతలు భావిస్తున్నారు.
గజ్వేల్, సిద్దిపేటలో పరిస్థితి మరింత దిగజారింది. అక్కడ రోజుకో వర్గం పుట్టుకొస్తున్నట్లు కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి. ఇటీవల రేవంత్ రెడ్డి గజ్వేల్ పర్యటన సందర్భంగా ఆయన ముందు ద్వంద్వ పోరు తారస్థాయికి చేరుకుంది. రెండు వర్గాలు ప్రత్యక్షంగా ఒకరిపై ఒకరు దాడులకు దిగడం గమనార్హం.
దుబ్బాక, నర్సాపూర్ నియోజకవర్గాల్లోనూ అంతర్గత విభేదాలు కట్టడి కావడం లేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ తమ స్వార్థ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని, పార్టీ కోసం పని చేయడం లేదని సీనియర్ నేతలు విమర్శలు చేస్తున్నారు.
ఈ విభేదాలు రాష్ట్రవ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో కనిపిస్తున్నాయి. దీంతో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ భూస్థాపితం కావడం ఖాయమని పలువురు సీనియర్ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.
