సోనియాగాంధీ, రాహుల్ గాంధీలతో తెలంగాణ నేతల భేటీ..

మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు గురువారం పార్లమెంటులో సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను కలిసి చర్చించారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య బీసీ రిజర్వేషన్లపై జంతర్ మంతర్ ధర్నా వివరాలను నేతలకు తెలియజేశారు.

సోనియా – రాహుల్ దిశానిర్దేశం
ఈ సమావేశంలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు నేతలకు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేయాలని సూచించారు. తెలంగాణ ప్రజలు ఎప్పుడూ కాంగ్రెస్‌కు వెన్నంటే ఉంటారని, బీసీ రిజర్వేషన్లు బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో మార్పు తేవాలని తెలిపారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

బీసీలకు మంత్రిపదవులు
సమావేశం అనంతరం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ, బీసీలకు మరో రెండు మంత్రిపదవులు ఇవ్వాలని కోరామని, తగిన సమయంలో ఏఐసీసీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. కాంగ్రెస్‌దే బీసీలకు మేలు చేసిన ఘనత అని గుర్తుచేశారు. ముస్లింలు కూడా ఈ దేశంలో భాగమేనని, వారి హక్కులను హరించకూడదని అన్నారు.

కేంద్రంపై ఒత్తిడి
తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్లతో పాటు రాజకీయ, విద్య, ఉద్యోగ రిజర్వేషన్లను కల్పిస్తూ బిల్లు ఆమోదించామని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. జంతర్ మంతర్ ధర్నాకు 18 రాజకీయ పార్టీల మద్దతు లభించిందని, కానీ బీజేపీ నేతలు రాకుండా మొహం చాటేశారని మండిపడ్డారు. కేంద్రం 42% రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు.

మోదీపై విమర్శలు
మోదీ సీఎంగా ఉన్నప్పుడే గుజరాత్‌లో ముస్లింలకు రిజర్వేషన్లు అమలులో ఉన్నాయని గుర్తుచేశారు. తెలంగాణ బీజేపీ నేతలు 42% రిజర్వేషన్ల అమలుకు ప్రధాని మోదీని ఒప్పించాలని కోరారు. మంత్రివర్గ విస్తరణపై ఏఐసీసీ తుది నిర్ణయం త్వరలో తీసుకోనుందని తెలిపారు.

Read More : కంచ గచ్చిబౌలి భూములపై హైకోర్టు రిజిస్ట్రార్‌కు సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు…

One thought on “సోనియాగాంధీ, రాహుల్ గాంధీలతో తెలంగాణ నేతల భేటీ..

Comments are closed.