గత ప్రభుత్వం హయాంలో డీసీసీబీలు అవినీతికి కేంద్రబిందువులుగా మారాయని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. గురువారం గుంటూరులో జిల్లా సహకార బ్యాంకు పర్సన్ ఇన్‌చార్జిగా మక్కెన మల్లికార్జునరావు బాధ్యతలు చేపట్టిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు.
మాజీ సీఎం జగన్ ప్రభుత్వంలో గడచిన ఐదేళ్ల కాలంలో డీసీసీబీలలో ఎన్నికలు జరగలేదని, ఆడిట్లు కూడా నిర్వహించలేదని ఆరోపించారు. దీనివల్ల పెద్దఎత్తున అక్రమాలు జరిగాయని అన్నారు. నకిలీ పాస్ పుస్తకాల ఆధారంగా కోట్ల రూపాయల రుణాలు అక్రమంగా పొందారని వెల్లడించారు. ఈ విషయంపై ఇప్పటికే విచారణకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. తప్పు చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
డీసీసీబీలలో అవినీతిని అరికట్టేందుకు హౌస్ కమిటీని నియమించినట్టు వెల్లడించిన మంత్రి, అన్ని లావాదేవీలను కంప్యూటరైజ్ చేసినట్టు చెప్పారు. ఇప్పటికే 98 శాతం కంప్యూటరీకరణ పూర్తయిందని వెల్లడించారు. జూన్ నెలలో జరిగిన ఆన్‌లైన్ లావాదేవీలపై ప్రత్యేకంగా విచారణ జరపాలని అధికారులను ఆదేశించినట్టు పేర్కొన్నారు.
రైతులకు ఖరీఫ్‌లో రుణాలు వెంటనే అందుబాటులోకి తేవాలని చర్యలు చేపట్టామని వెల్లడించిన అచ్చెన్నాయుడు, కౌలు రైతులకు 100 శాతం రుణాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో సభ్యత్వాల నమోదులో కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు.
ఇక నల్లబర్లి పొగాకు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారని, గత ఏడాది కంటే మూడు రెట్లు దిగుమతులు పెరగడం వల్ల కంపెనీలు రైతులకు నల్లబర్లి పొగాకు సాగు మానుకోవాలని సూచిస్తున్నాయని మంత్రి తెలిపారు. డీసీసీబీలకు మంచి పేరు తీసుకొచ్చేందుకు రైతులకి పూర్తిస్థాయిలో సహకరిస్తామని పేర్కొన్నారు.
Read More : వచ్చే ఏడాది నాటికి కోటి మొక్కల లక్ష్యం

One thought on “డీసీసీబీల్లో వైసీపీ హయాంలో భారీ అవినీతి”
Comments are closed.