ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాలను గెలుస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి సవాల్‌ను తాను స్వీకరిస్తున్నానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. హామీల అమలుకు ప్రణాళిక, కార్యాచరణను ప్రకటిస్తే తాము చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. ఏ ఒక్క హామీకి కనీస కార్యాచరణ కూడా లేకుండానే చర్చకు రావాలన్న ఆహ్వానం హాస్యాస్పదమన్నారు. చర్చ ఎందుకు, ఏ అంశాలపై జరగాలనే విషయాన్ని సీఎం రేవంత్ స్పష్టంగా చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే ముందు ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. బీజేపీకి మద్దతు ఇచ్చి గెలిపించాలని పిలుపునిచ్చారు. గతంలో బీఆర్ఎస్ పాలనలో శాసన మండలి ప్రాముఖ్యత తగ్గిపోయిందని విమర్శించారు. ఈ ఎన్నికల్లో పసుపు బోర్డు ప్రభావం ఉంటుందని అభిప్రాయపడ్డారు. కుల గణన విషయంలో బీజేపీ వ్యతిరేకం కాదని, రిజర్వేషన్లను తాము స్వాగతిస్తున్నామని తెలిపారు. అయితే, ముస్లింలను బీసీ జాబితాలో చేర్చే ప్రయత్నాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు.
బీజేపీకి, బీఆర్ఎస్‌కు ఎలాంటి సంబంధాలు లేవని, బీఆర్ఎస్ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయాలని ప్రయత్నిస్తోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. గతంలో అనేకసార్లు బీఆర్ఎస్ కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికను జిల్లా అధ్యక్షుల నియామకాల తర్వాత చేపడతామని వెల్లడించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం 14 నెలల్లో ప్రజలకు ఏమీ చేయలేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆశలు, హామీలను తుంగలో తొక్కారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలో శాసన మండలి ప్రాధాన్యత తగ్గిపోయిందని అన్నారు. ప్రజా సమస్యలపై పోరాటానికి శాసన మండలి వేదికగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కుల గణనకు తాము వ్యతిరేకం కాదని, కానీ ముస్లింలను బీసీల్లో చేర్చే ప్రయత్నాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
