కులగణనపై బీఆర్ఎస్, బీజేపీ కుట్ర – సీఎం తీవ్ర విమర్శలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్, బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. కులగణన ప్రక్రియను నిర్వీర్యం చేసేందుకు ఈ రెండు పార్టీలు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. ఈ అంశంపై కోర్టుల్లో కేసులు వేసే అవకాశముందని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కులగణన చేపడతామని ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని నెరవేర్చామని వివరించారు. బలహీన వర్గాల మద్దతుతోనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని, అందుకే బీసీ కులగణన జరిపామని చెప్పారు.

గాంధీభవన్‌లో శనివారం మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ ఒక్క రోజులో సర్వే నిర్వహించి అర్ధసత్యాలు చెప్పారని ఆరోపించారు. తాము ప్లానింగ్ విభాగాన్ని నోడల్ ఏజెన్సీగా పెట్టుకుని సర్వే నిర్వహించామని స్పష్టం చేశారు. కేసీఆర్ చేసిన సమగ్ర కుటుంబ సర్వే తప్పుబట్టారు. ఎస్సీల్లో 56 కులాలు ఉంటే, 86 కులాలుగా చూపించారని విమర్శించారు. తాము చేపట్టిన సర్వేను తప్పుబడుతున్న వారు ఎక్కడ తప్పు ఉందో వివరించాలని అన్నారు.

బీజేపీపై విమర్శలు

బీజేపీ ప్రభుత్వంపై కూడా రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీసీ అని చెప్పుకుంటారని, అయితే 2011లో కాంగ్రెస్ నిర్వహించిన బీసీ సర్వే వివరాలు ఎందుకు బయట పెట్టడం లేదని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు నిజమైన ప్రేమ ఉంటే ఆ లెక్కలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఈ డిమాండ్ పెరుగుతుందని, బీసీల లెక్క తేలితే బీజేపీలో అధికారం కూర్చున్న కొన్ని సామాజిక వర్గాలకు ఇబ్బంది కలుగుతుందని ఆరోపించారు.

బీఆర్ఎస్‌పై తీవ్ర ఆరోపణలు

రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఇప్పటివరకు తమ వివరాలను కులగణనలో నమోదు చేసుకోలేదని అన్నారు. 50శాతం మంది ప్రజలు ఉన్నా, అర శాతం జనాభా ఉన్న వారే ప్రశ్నిస్తున్నారని, అందుకే వారికి భయం పట్టుకుందని వ్యాఖ్యానించారు. బీసీల సర్వేకు సహకరించకపోవడం వెనుక పెద్ద కుట్రే ఉందని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం నాలుగు కేటగిరీల్లో లెక్కలు తీసుకున్నా, తాము ఐదు కేటగిరీల్లో పూర్తి వివరాలను సేకరించామని తెలిపారు.

కులగణనపై స్పష్టత

తెలంగాణలో బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని, వారి హక్కులను కాపాడేందుకు తాము కట్టుబడి ఉన్నామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం కులగణన వివరాలను దాచిపెట్టిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా సర్వే నిర్వహించి ప్రజలకు నిజమైన గణాంకాలను అందిస్తున్నామని చెప్పారు.

Read More