కవిత సంచలన వ్యాఖ్యలు

kavitha

“రేవంత్ జుట్టు చంద్రబాబు చేతిలో… చంద్రబాబు జుట్టు మోదీ చేతిలో”

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిగా చంద్రబాబు ప్రభావంలోనే ఉన్నారని, ఆయన కూడా ప్రధాని మోదీ ఆధీనంలోనే సాగుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం తెలంగాణ ప్రజల దురదృష్టమని ఆమె అన్నారు.

రేవంత్‌పై తీవ్ర విమర్శలు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్‌లో పర్యటిస్తూ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “రేవంత్ విషయంలో సుప్రీంకోర్టు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినా, ఆయన తన తీరును మార్చుకోలేదు. మరోసారి కోర్టు చీవాట్లు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. రేవంత్, చంద్రబాబు భేటీ అయిన తర్వాతే ఆంధ్రకు నీటి తరలింపు ప్రారంభమైంది. చంద్రబాబు చెప్పినదే రేవంత్ పాటిస్తున్నారు. ఇక చంద్రబాబు జుట్టు ప్రధాని మోదీ చేతిలో ఉందని స్పష్టంగా కనిపిస్తోంది” అని వ్యాఖ్యానించారు.

పసుపు రైతుల కోసం పోరాటం

పసుపు బోర్డును నామమాత్రంగా ఏర్పాటు చేశారని కవిత ఆరోపించారు. “పసుపు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పసుపు ధర క్రమంగా పడిపోతున్నా, ప్రభుత్వం స్పందించడం లేదు. 15 వేల మద్దతు ధర ఇస్తామన్న హామీ నెరవేరలేదు. వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి రైతులను మోసం చేస్తున్నారు. మార్చి 1 వరకు గడువు ఇస్తున్నాం. పసుపు ధరపై స్పష్టత లేకుంటే, రైతులతో కలసి కలెక్టరేట్లను ముట్టడిస్తాం” అని హెచ్చరించారు.

పార్లమెంటులో పసుపు బోర్డుపై బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాల్సిన అవసరం ఉందని కవిత పేర్కొన్నారు. “పసుపు క్వింటాలకు రూ.12,000 మద్దతు ధర ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఆ హామీని నిలబెట్టుకోవాలి. రూ.12,000 కన్నా తక్కువ ధర వస్తే, రైతులకు బోనస్ రూపంలో తేడాను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం” అని ఆమె స్పష్టం చేశారు.