జట్టు కూర్పులో కీలక మార్పులు చేయనున్న టీమ్‌ ఇండియా ?

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌ను ఎలాగైనా డ్రా చేయాలని టీమ్‌ ఇండియా కసరత్తును ముమ్మరం చేసింది. ఈ లక్ష్యంతో జట్టు కూర్పులో కీలక మార్పులు చేయాలని యాజమాన్యం నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే లండన్‌ చేరుకున్న భారత జట్టు తీవ్రంగా సాధన చేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడని ఎడమచేతి పేస్‌ బౌలర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ ఐదో టెస్టులో ఆడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నాలుగో టెస్టులో అర్ష్‌దీప్‌ను ఆడించాలని తొలుత భావించినా, ఎడమ చేతి బొటనవేలికి గాయం కారణంగా అవకాశం దక్కలేదు. అయితే తాజాగా లండన్‌లోని ఓవల్‌ మైదానంలో అర్ష్‌దీప్‌ చురుకుగా బౌలింగ్‌ చేయడం గాయం నుంచి పూర్తిగా కోలుకున్న సంకేతాలుగా భావిస్తున్నారు. దీంతో అతడి పేరు తుది జట్టులో దాదాపు ఖాయమని టీమ్‌ వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పటివరకు 21 టెస్టుల్లో 66 వికెట్లు తీసిన అర్ష్‌దీప్‌ జట్టులో ఉన్న ఏకైక ఎడమచేతి వాటం పేసర్‌. ఇంగ్లాండ్‌ బ్యాటర్ల దూకుడుకు అడ్డుకట్ట వేయడంలో అతడు కీలక పాత్ర పోషిస్తాడని యాజమాన్యం నమ్ముతోంది.

ఇక మాంచెస్టర్‌ టెస్టులో నిరాశపరిచిన కొత్త పేసర్‌ అన్షుల్‌ కాంబోజ్‌కు తుది జట్టులో స్థానం దక్కే అవకాశాలు తగ్గాయని తెలుస్తోంది. తొలి టెస్టులో పేలవ ప్రదర్శన చేసిన ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ పైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

నాలుగో టెస్టుకు గాయం కారణంగా దూరమైన ఆకాశ్‌దీప్‌ కూడా కోలుకున్నట్లు కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ వెల్లడించాడు. తాజా పరిస్థితుల ప్రకారం స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ జట్టులో లేనిపక్షంలో అర్ష్‌దీప్‌, ఆకాశ్‌దీప్‌లను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

చివరి మ్యాచ్‌లో బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలన్న ఆలోచన యాజమాన్యంలో ఉన్నప్పటికీ, అతడి పూర్తి ఫిట్‌నెస్‌ దృష్ట్యా కీలకమైన ఈ మ్యాచ్‌లో ఆడించే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.

Read More : బీసీసీఐ కార్యాలయంలో జెర్సీ చోరీ..

One thought on “జట్టు కూర్పులో కీలక మార్పులు చేయనున్న టీమ్‌ ఇండియా ?

Comments are closed.