బీసీసీఐ కార్యాలయంలో జెర్సీ చోరీ..

బీసీసీఐ కార్యాలయంలో చోరీ సంఘటన వెలుగులోకి వచ్చింది. ముంబైలోని వాంఖేడే స్టేడియంలో ఉన్న బీసీసీఐ కార్యాలయం నుంచి రూ. 6.5 లక్షల విలువైన ఐపీఎల్ జెర్సీలు దొంగిలించబడ్డాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు సెక్యూరిటీ గార్డుగా పనిచేసే ఫరూఖ్ అస్లాం ఖాన్ ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించి అరెస్టు చేశారు. ఒక్కో జెర్సీ ధర రూ. 2,500గా అంచనా వేయగా, ఇవి వేర్వేరు జట్లకు చెందినవని తెలిపారు. పోలీసుల విచారణలో ఫరూఖ్ జూదానికి బానిసై ఈ దొంగతనానికి పాల్పడ్డాడని తేలింది. అతడు చోరీ చేసిన జెర్సీలను హర్యానాకు చెందిన ఓ ఆన్‌లైన్ డీలర్‌కు విక్రయించినట్లు నిర్ధారణ అయింది. ఈ ఘటన జులై 13న జరిగినప్పటికీ, స్టోర్‌రూంలో ఆడిట్ సమయంలో స్టాక్ మిస్ అయినట్లు తేలడంతో ఆలస్యంగా బయటపడింది. సీసీటీవీ ఫుటేజీ పరిశీలన తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

బీసీసీఐ అధికారులు జులై 17న మెరైన్ డ్రైవ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితుడు జెర్సీలను కొరియర్ ద్వారా ఆన్‌లైన్ డీలర్‌కు పంపినట్లు అంగీకరించాడు. సెక్యూరిటీ గార్డు నుంచి జెర్సీలు కొనుగోలు చేసిన డీలర్‌ను విచారణ కోసం హర్యానా నుంచి పిలిపించగా, తనకు జెర్సీలు దొంగతనమైనవని తెలియలేదని అతడు తెలిపాడు. కార్యాలయంలో పునరుద్ధరణ పనులు జరుగుతున్నందున స్టాక్ క్లియరెన్స్‌లో భాగంగా విక్రయిస్తున్నట్లు గార్డు చెప్పాడని డీలర్ వివరించాడు.

ఫరూఖ్ తన ఖాతాలో వచ్చిన డబ్బును ఆన్‌లైన్ బెట్టింగ్‌లో పోగొట్టుకున్నట్లు విచారణలో ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై మరింత దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.

Read More : ఫిడే మహిళల ప్రపంచకప్ విజేత దివ్య దేశ్‌ముఖ్

One thought on “బీసీసీఐ కార్యాలయంలో జెర్సీ చోరీ..

Comments are closed.