హంద్రీనీవా కాలువకు లైనింగ్ పనులు, ప్రవాహం పెంపుపై శాసన మండలిలో తీవ్ర చర్చ చోటుచేసుకుంది. వైసీపీ సభ్యుడు శివరామిరెడ్డి హంద్రీనీవా కాలువ లైనింగ్ పనులను ఆపాలని కోరారు. లైనింగ్ వల్ల భూగర్భ జలాలు పెరగవని, ప్రవాహం పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. హంద్రీనీవా ప్రవాహాన్ని పదివేల క్యూసెక్కులకు పెంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ ఆరోపణలకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్రంగా స్పందించారు. హంద్రీనీవా కాలువ ఎన్టీఆర్ కృషి ఫలితమని, ఏ ప్రాజెక్టుపైనా చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.
జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వైసీపీ ఆరోపణలకు ధీటైన సమాధానం ఇచ్చారు. హంద్రీనీవా ద్వారా 2025 జూన్ కల్లా రెట్టింపు జలాలు ప్రవహించేలా సీఎం చంద్రబాబు చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ప్రస్తుతం 2200 క్యూసెక్కులుగా ఉన్న ప్రవాహాన్ని 3850 క్యూసెక్కులకు పెంచాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారని తెలిపారు.
హంద్రీనీవా కాలువ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం రూ.3240 కోట్లు కేటాయించిందని వెల్లడించారు. ప్రవాహాన్ని పెంచి కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని పలు ప్రాంతాలకు అదనపు నీరు అందిస్తామన్నారు. హంద్రీనీవా కాలువ 216 నుంచి 400 కిలోమీటర్ల వరకు విస్తరించి 195 చెరువులు అభివృద్ధి చేయాలని ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు.
భవిష్యత్తులో హంద్రీనీవా ద్వారా నీటి ప్రవాహాన్ని దశలవారీగా గణనీయంగా పెంచేందుకు సీఎం చంద్రబాబు నిర్ణయించారని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. హంద్రీనీవా కాలువ లైనింగ్ చేయవద్దని వైసీపీ సభ్యులు చెబుతున్నప్పటికీ గతంలో జగన్ ఆదేశాలిచ్చినప్పుడు వారు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.
గత ఐదేళ్ల వైసీపీ హయాంలో ఒక్క క్యూసెక్కు ప్రవాహాన్నీ పెంచలేదని, హంద్రీనీవా పనులకు రూపాయి ఖర్చు చేయలేదని మంత్రి నిలదీశారు. చంద్రబాబు హయాంలో మల్యాల వద్ద మోటార్లు ఏర్పాటు చేయగా, జగన్ హయాంలో అవి ఎందుకు వినియోగించలేదని ప్రశ్నించారు. రాయలసీమను సస్యశ్యామలం చేయడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.

One thought on “హంద్రీనీవాపై వైసీపీ రచ్చ.. మంత్రి ధీటైన సమాధానం”
Comments are closed.