వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణ మురళి (Posani Krishna Murali) బెయిల్ పిటిషన్‌పై గుంటూరు కోర్టులో వాదనలు ముగిశాయి. అయితే తీర్పును న్యాయస్థానం ఈనెల 21కి వాయిదా వేసింది. దీంతో పోసానికి బెయిల్ మంజూరవుతుందా లేదా అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.
గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని తరపు న్యాయవాదులు ఆయనకు బెయిల్ మంజూరు చేయాలంటూ సీఐడీ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. గత రెండు రోజుల క్రితం కూడా విచారణ జరుగగా, న్యాయస్థానం దీనిపై నేటికి వాయిదా వేసింది. ఈరోజు వాదనలు ముగిసిన అనంతరం న్యాయస్థానం తీర్పును ఈనెల 21కి వాయిదా వేసింది. అయితే ఈనెల 23 వరకు పోసానికి సీఐడీ కోర్టు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.
కేసు నేపథ్యం
పోసాని కృష్ణ మురళి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu), ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan), మంత్రి నారా లోకేష్ (Minister Lokesh)పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్‌లో ఉన్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై రాష్ట్రవ్యాప్తంగా పలు కేసులు నమోదయ్యాయి.
పోసాని విచారణ
ఇప్పటికే ఒక రోజు పాటు కస్టడీకి తీసుకుని పోసానిని సీఐడీ పోలీసులు విచారించారు. మరోసారి పోసాని కస్టడీ కోసం సీఐడీ అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో కస్టడీ పిటిషన్ వేయకముందే బెయిల్ వస్తుందా? లేక పీటీ వారెంట్ వేయించి మరలా రిమాండ్ విధిస్తారా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
పీటీ వారెంట్ కేసు
గతంలో పోసాని హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో, టీడీపీ కార్యకర్త బండారు వంశీకృష్ణ సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీంతో సీఐడీ పోసానిపై కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో ఈనెల 12న కర్నూలు జిల్లాలో ఉన్న పోసానిని పీటీ వారెంట్‌పై గుంటూరుకు తరలించి కోర్టులో హాజరుపర్చారు. కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. అనంతరం సీఐడీ మరోసారి పోసాని కస్టడీకి కోరగా, న్యాయస్థానం ఒక రోజు కస్టడీకి అనుమతించింది. ఈ క్రమంలో మంగళవారం పోసానిని గుంటూరు జిల్లా జైలు నుంచి సీఐడీ కార్యాలయానికి తరలించి విచారించారు.
పోసాని కృష్ణ మురళి సీఐడీ విచారణలో “సాక్షి మీడియా చెప్పిన కారణంగానే ఆ మీడియా సమావేశంలో మాట్లాడాను” అని పేర్కొన్నట్లు సమాచారం.

One thought on “పోసాని బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగింపు”
Comments are closed.