GHMC వీధి దీపాల నిర్వహణకు నూతన యాప్ – అధికారులకు ప్రత్యేక శిక్షణ

GHMC

హైదరాబాద్‌లో వీధి దీపాల నిర్వహణను మరింత సమర్థంగా చేపట్టేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. వీధి దీపాల పనితీరును పర్యవేక్షించేందుకు ప్రత్యేక మొబైల్ యాప్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.

ఈ మేరకు GHMC కమిషనర్ ఇలంబరిది అధికారికంగా ప్రకటన చేస్తూ, యాప్ ద్వారా వీధి దీపాల నిర్వహణపై సమగ్ర వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీని ద్వారా విద్యుత్ స్తంభాలు, వీధి దీపాలు, మీటర్లు, సెంట్రలైజ్డ్ కంట్రోల్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ (CCMS) ప్యానల్స్ వంటి వివరాలను యాప్‌లో నమోదు చేయనున్నారు.

GHMC అధికారులకు శిక్షణ కార్యక్రమం

జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో టీజీ ఆన్‌లైన్ ఏజెన్సీ ఆధ్వర్యంలో మంగళవారం అధికారులు, సిబ్బందికి ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఫిర్యాదుల పరిష్కారాన్ని వేగవంతం చేయడానికి యాప్‌లో ఒక్కో విద్యుత్ స్తంభానికి ప్రత్యేక గుర్తింపు నంబర్ ఇచ్చి, తరచూ సమస్యలు తలెత్తే ప్రాంతాలను గుర్తించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటారు.

ఈ యాప్ ద్వారా ఫిర్యాదులు వచ్చిన వెంటనే, సమస్య ఎక్కడ ఉందో సిబ్బంది సులభంగా గుర్తించగలరు. వీధి దీపాల ఆడిట్, డేటా ఎంట్రీ, మరమ్మతులు తదితర అంశాలను యాప్ ద్వారా ఎలా నిర్వహించాలో ఏజెన్సీ ప్రతినిధులు డెమో అందించారు.

ఈ కార్యక్రమంలో GHMC అదనపు కమిషనర్ శివకుమార్ నాయుడు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. GHMC ఆధ్వర్యంలో త్వరలోనే ఈ యాప్‌ను అధికారికంగా ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.

Read More : హైడ్రా, జీహెచ్ఎంసీ సంయుక్తంగా హైదరాబాద్‌లో రెండు కమిటీలను ఏర్పాటు: అగ్ని ప్రమాదాలు మరియు వరద ముంపు నివారణపై సమీక్ష

One thought on “GHMC వీధి దీపాల నిర్వహణకు నూతన యాప్ – అధికారులకు ప్రత్యేక శిక్షణ

Comments are closed.