గోదావరి – బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై సీఎం కీలక వ్యాఖ్యలు

పోలవరం – బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించింది. తాజాగా జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాజెక్టును రాజకీయ అంశంగా కాక, రెండు రాష్ట్రాలకు ప్రయోజనం కలిగే విధంగా ముందుకు తీసుకెళ్లాలని మంత్రులకు స్పష్టంగా సూచించారు.

కేబినెట్ సమావేశంలో ఈ ప్రాజెక్టుపై విస్తృత చర్చ జరిగింది. గత దశాబ్దంలో తెలంగాణ ప్రభుత్వం అనేక సాగునీటి ప్రాజెక్టులను నిర్మించిందని, కొన్ని పథకాలకు అనుమతులు లేకపోయినా ఏపీ ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని అధికారులు తెలిపారు. ఇక గోదావరి – బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకూ కేంద్ర జల సంఘం (CWC) అనుమతులు లభించే అవకాశముందని మంత్రి మండలి అభిప్రాయపడింది.

ఈ ప్రాజెక్టు వల్ల ఎలాంటి నష్టం వాటిల్లదని, కేవలం సముద్రంలోకి వృథాగా వెళ్లిపోతున్న నీటిని వినియోగించుకోవడమే లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. గోదావరి నదిలో సగటున 3 వేల టీఎంసీల నీరు సముద్రంలోకి కలుస్తోందని, అందులో రెండు రాష్ట్రాలు చెరో 200 టీఎంసీలను వినియోగించుకున్నా ఏలాంటి నష్టం కలగదని వివరించారు. ఇది ఇద్దరు రాష్ట్రాల హక్కుగా భావించాలన్నారు.

ప్రాజెక్టు పై రాజకీయ వాగ్ధానాలు, విమర్శలకంటే, రెండు రాష్ట్రాలు పరస్పర చర్చలతో సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రత్యేకించి మీడియాతో మాట్లాడేటప్పుడు సంయమనంగా వ్యవహరించాలని మంత్రులకు హెచ్చరిక చేశారు. కేంద్రంతో గట్టి వాదనలు వినిపించాల్సిన అవసరం ఉందని, ఈ ప్రాజెక్టు పై చెలరేగే ఉద్రిక్తతలు, రాజకీయ విమర్శలకు తావు ఉండకూడదని స్పష్టం చేశారు.

ఇదే సమయంలో ప్రాజెక్టు వల్ల ఇరు రాష్ట్రాలకు ఉన్న ప్రయోజనాలను ప్రజల ముందు స్పష్టంగా చెప్పాలన్న సూచన కూడా సీఎం చంద్రబాబు చేసినట్టు సమాచారం.

Read More : డాక్టర్ డీవీఆర్ సైనిక్ స్కూల్‌ను ప్రారంభించిన నారా లోకేశ్