ఎమర్జెన్సీ : పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు

స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యంత గంభీర ఘటనగా చరిత్రలో నిలిచిపోయిన ఎమర్జెన్సీకి 50 సంవత్సరాలు పూర్తైన నేపథ్యంలో జనసేన అధినేత, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ఇది కేవలం రాజకీయ ఘటన కాదని, రాజ్యాంగానికి జరిగిన ఘోర ద్రోహమని వ్యాఖ్యానించారు.

ఎమర్జెన్సీపై ‘ఎక్స్’ (మాజీ ట్విట్టర్‌) వేదికగా స్పందించిన పవన్ కల్యాణ్, 1975లో విధించిన ఎమర్జెన్సీ ప్రజాస్వామ్యంపై గుదిబండగా నిలిచిందని తెలిపారు. “పత్రికల గొంతు నొక్కారు, ప్రతిపక్షాల స్వరాన్ని అణిచేశారు, ప్రాథమిక హక్కులను కాలరాశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు నిలబడ్డ లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్, అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్.కె. అద్వానీ, జార్జ్ ఫెర్నాండెజ్, మొరార్జీ దేశాయ్ వంటి గొప్ప నాయకులను జైళ్లలో నిర్బంధించారు” అని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు.

‘‘ఇది కాంగ్రెస్ నాయకత్వం అధికారం కోసం ఎంత దూరం వెళ్లగలదనే ఉదాహరణ. నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా నిలబడి ప్రజాస్వామ్యాన్ని కాపాడిన వారిని మనం స్మరించుకోవాలి. ఈ రోజు ‘సంవిధాన్ హత్య దినంగా’ వారి త్యాగాలను గౌరవిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.

ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత అందరిపైనా ఉందని, రాజకీయ అవసరాల కోసం రాజ్యాంగ విలువలతో రాజీ పడే ప్రయత్నాలను ప్రజలు తిరస్కరించాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య స్థాపనకు ఎంతో త్యాగాలు చేశారు కాబట్టి, వాటిని మరవకూడదని, నేటి తరానికి ఇది గుణపాఠంగా నిలవాలన్నారు.

Read More : గోదావరి – బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై సీఎం కీలక వ్యాఖ్యలు