డాక్టర్ డీవీఆర్ సైనిక్ స్కూల్‌ను ప్రారంభించిన నారా లోకేశ్

Nara Lokesh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సోమవారం బాపట్ల జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఇంకొల్లు మండలంలోని గంగవరం రోడ్డులో ఏర్పాటు చేసిన డాక్టర్ డీవీఆర్ సైనిక్ స్కూల్‌ను లాంఛనంగా ప్రారంభించారు. మాజీ మంత్రి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు స్థాపించిన ఈ పాఠశాల ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న లోకేశ్, పాఠశాల ప్రధాన భవనం, కంప్యూటర్ సైన్స్ ల్యాబ్, బాలురూ బాలికల వసతిగృహాలు, క్యాంటీన్, మెస్ భవనాలను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, ఎంపీ పురందేశ్వరి, స్కూల్ కార్యదర్శి హితేశ్ చెంచురామ్, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం మంత్రి లోకేశ్, పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దగ్గుబాటి చెంచురామయ్య మరియు దగ్గుబాటి నీలమోహన్ విగ్రహాలను ఆవిష్కరించారు.

అడుగడుగునా భవ్య స్వాగతం

బాపట్ల జిల్లాలో మంత్రి లోకేశ్ పర్యటనకు ఘన స్వాగతం లభించింది. జె.పంగులూరు, ఆరికట్లవారిపాలెం, గంగవరం గ్రామాల్లో టీడీపీ శ్రేణులు, స్థానిక ప్రజలు ఆయనను పూలమాలలు, ప్లకార్డులు, బాణసంచాలతో స్వాగతం పలికారు. మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి ఆయనను ఆత్మీయంగా పలకరించారు.

ప్రజలతో మమేకం – సమస్యల పరిష్కారానికి హామీ

ప్రత్యేకంగా ప్రజలతో మమేకమైన మంత్రి లోకేశ్, నేరుగా వారి నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. ప్రతి సమస్యను సహానుభూతితో విని, వాటి పరిష్కారానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యను అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ సైనిక్ స్కూల్ భవిష్యత్తులో దేశానికి ఉత్తమ పౌరులను అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు.

Read More : 10 ఏళ్ల గిరిజన బాలికపై దాడి చేసిన నలుగురు దుండగులు