ముగిసిన సీఎం సింగపూర్ పర్యటన

సింగపూర్ పర్యటన ముగించుకొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం స్వదేశానికి బయలుదేరారు. ఈ సందర్భంగా సింగపూర్‌లోని తెలుగు ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. హోటల్‌ వద్ద పెద్ద సంఖ్యలో చేరిన తెలుగు ప్రజలతో సీఎం చంద్రబాబు ముచ్చటిస్తూ, తమపై చూపిన ప్రేమాభిమానాలను ఎప్పటికీ మరవలేనని కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం స్థానిక అధికారులు, తెలుగు ప్రజల మధ్య సీబీఎన్‌ జైకారల నడుమ ఆయన సింగపూర్ విమానాశ్రయానికి చేరుకున్నారు.

సింగపూర్‌ నుంచి బుధవారం రాత్రి 10.30 గంటలకు సీఎం చంద్రబాబు హైదరాబాద్‌ శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు బయల్దేరి రాత్రి 11.30 గంటలకు ఉండవల్లిలోని నివాసానికి చేరుకోనున్నారు. నాలుగు రోజుల పర్యటనలో సీఎం చంద్రబాబు 26 సమావేశాలతో పాటు అనేక కీలక కార్యక్రమాల్లో పాల్గొన్న విషయం తెలిసిందే.

ఇక మున్సిపల్‌ పరిపాలన శాఖ మంత్రి పీ. నారాయణ సింగపూర్‌లో పర్యటనను కొనసాగిస్తున్నారు. బుధవారం ఉదయం ఆయన సీఆర్డీఏ కమిషనర్‌ కన్నబాబుతో కలిసి సుర్బానా జురాంగ్‌ (ఎస్‌జే) సంస్థ కార్యాలయాన్ని సందర్శించారు. అమరావతిలో సూక్ష్మ స్థాయి పచ్చదనం అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఆ సంస్థ ప్రతినిధులతో చర్చించారు. అమరావతి మాస్టర్‌ ప్లాన్‌కు అనుగుణంగా పార్కులు, రహదారుల పక్కన పచ్చదనం పెంపు, పర్యావరణ పరిరక్షణ చర్యలపై సంస్థ ప్రతినిధులు ప్రణాళికలను వివరించారు. బ్లూ-గ్రీన్‌ సిటీ కాన్సెప్ట్‌లో అమరావతిని అభివృద్ధి చేయడంలో సుర్బానా జురాంగ్‌ సంస్థకు విశేష అనుభవం ఉందని అధికారులు పేర్కొన్నారు.

Read More : సింగపూర్‌లో ఐవిపి ఫౌండర్‌తో నారా లోకేష్ భేటీ

One thought on “ముగిసిన సీఎం సింగపూర్ పర్యటన

Comments are closed.