విశాఖలో రూ.50 వేల కోట్లతో గూగుల్ భారీ డేటా సెంటర్

గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో భారీ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. దాదాపు 6 బిలియన్ డాలర్లు (సుమారు రూ.50,000 కోట్లు) పెట్టుబడితో విశాఖపట్నంలో 1 గిగాబైట్ సామర్థ్యం గల ఈ డేటా సెంటర్ నిర్మాణం చేపట్టనుంది. భారతదేశంలో గూగుల్ ఇంత పెద్ద స్థాయిలో పెట్టుబడి పెట్టడం ఇదే మొదటిసారి కావడం విశేషం. అంతేకాకుండా ఆసియాలో ఇంత పెద్ద డేటా సెంటర్‌ను ఇంత భారీ వ్యయంతో నిర్మించడం ఇదే మొదటి సారి.

ఈ డేటా సెంటర్‌కు అవసరమైన విద్యుత్ ఉత్పత్తి కోసం సౌరశక్తి, పవనశక్తి వినియోగించనున్నారు. ఈ నిమిత్తం 2 బిలియన్ డాలర్లను ఖర్చు చేయాలని గూగుల్ ప్రణాళికలు సిద్ధం చేసింది. పర్యావరణానికి హాని కలగకుండా విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకతను సంతరించుకోనుంది.

భారతదేశంలో వేగంగా పెరుగుతున్న డిజిటల్ సేవల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని గూగుల్ ఈ పెట్టుబడికి ముందుకు వచ్చింది. విశాఖపట్నం ఎంపిక వెనుక ఆ ప్రాంత భౌగోళిక ప్రత్యేకతలు, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న మద్దతు కీలక పాత్ర పోషించాయి. ఈ పెట్టుబడితో దేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో టెక్నాలజీ రంగం మరింత అభివృద్ధి చెందనుందని నిపుణులు భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా, ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ ఇటీవల సింగపూర్ పర్యటనలో టెక్ దిగ్గజాలతో వరుస భేటీలు నిర్వహించారు. నిన్న సింగపూర్‌లో జరిగిన బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో నారా లోకేశ్ గూగుల్ క్లౌడ్ డైరెక్టర్ డ్రూ బైన్స్‌తో చర్చించారు. విశాఖలో డేటా సిటీ స్థాపనకు అవసరమైన అన్ని సదుపాయాలు సిద్ధం చేశామని, గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని లోకేశ్ కోరారు. ఏపీ ప్రతిపాదనలపై ఉన్నతస్థాయిలో నిర్ణయం తీసుకుంటామని బైన్స్ హామీ ఇవ్వగా, దానిపై గూగుల్ ముందడుగు వేసినట్టు సమాచారం.

Read More : సింగపూర్ పర్యటన ముగించుకున్న సీఎం

One thought on “విశాఖలో రూ.50 వేల కోట్లతో గూగుల్ భారీ డేటా సెంటర్

Comments are closed.