అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో ఈ రోజు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా రాజధాని అమరావతి పరిధిలో 20,494 ఎకరాల భూమి సమీకరణకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అంతేకాకుండా, నాలుగు అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి, హై డెన్సిటీ రెసిడెన్షియల్ జోన్ ఏర్పాటుకు, పలు సంస్థలకు భూ కేటాయింపులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్టు సమాచారం. అమరావతిలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు మరియు అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక చిహ్నాల ఏర్పాటుపై మంత్రివర్గం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక కేంద్ర ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తపరిచి తిరస్కరించిన బనకచర్ల ప్రాజెక్టుపై కూడా చర్చించనున్నారు.
అంతేగాక, ‘తల్లికి వందనం’ కార్యక్రమం అమలు తీరుపై సమీక్ష, అలాగే ఆగస్టు 15 నుంచి ప్రారంభించనున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంశంపైనా మంత్రివర్గం ఆలోచించనుంది. సమావేశం అనంతరం రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై సీఎం చంద్రబాబు మంత్రులతో ప్రత్యేకంగా చర్చించే అవకాశముంది.
Read More : ప్రసన్న వ్యాఖ్యలపై మంత్రి అనిత తీవ్ర స్పందన
