స్త్రీ సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం – ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్

మహిళల ఆర్థిక స్వావలంబనతోనే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళలు కుటుంబ నిర్వహణ నుంచి పరిపాలన, వాణిజ్య రంగం, పరిశ్రమల నిర్వహణ వరకు ప్రతీ విభాగంలో కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు.

ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో, “కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా సంక్షేమం కోసం కృషి చేస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థికంగా మహిళల్ని మరింత బలోపేతం చేసేందుకు పలు పథకాలు అమలు చేస్తున్నాం” అని తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాల ద్వారా 11.5 లక్షల మందికి దాదాపు రూ.4 వేల కోట్ల ప్రయోజనాలు అందించేందుకు చర్యలు చేపడుతోంది అని వివరించారు.

కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా మహిళలకు లబ్ధి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జన్ ధన్ యోజన, ఉజ్వల్ యోజన పథకాల ద్వారా లక్షలాది మహిళలు లబ్ధి పొందారని తెలిపారు. ఈ పథకాలు మహిళల ఆర్థిక స్వావలంబనకు దోహదపడుతున్నాయని, భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు.

స్త్రీ రక్షణ, గౌరవానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

సమాజంలో మహిళలకు గౌరవం, భద్రత అత్యంత ప్రాధాన్యమైన అంశాలని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. “మహిళల గౌరవానికి భంగం కలిగించేలా సోషల్ మీడియా లేదా ఇతర మార్గాల్లో ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఏపీలో మహిళల రక్షణ మా ప్రభుత్వ బాధ్యత” అని హెచ్చరించారు.

మహిళా సంక్షేమం, రక్షణ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం నూతన విధానాలను రూపొందిస్తోందని, భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ చర్యలు తీసుకుంటామని పవన్ కల్యాణ్ వెల్లడించారు.

Read More

One thought on “స్త్రీ సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం – ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్

Comments are closed.