అమరావతి నుంచి ఓ శుభవార్త!

ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం తన ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. తాజాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో మరో కీలక వాగ్దానానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రతిష్టాత్మకంగా ‘తల్లికి వందనం’ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయనున్నారు.

ఈ పథకంలో భాగంగా ప్రతి విద్యార్థికి ఏటా రూ.15,000 ఆర్థిక సహాయం అందజేస్తారు. ఇందులో రూ.1,000 పాఠశాల మరుగుదొడ్ల నిర్వహణ నిధికి, మరో రూ.1,000 పాఠశాల నిర్వహణ నిధికి మినహాయించి, మిగిలిన రూ.13,000 నేరుగా తల్లుల ఖాతాలో జమ చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 67,27,164 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుండగా, దీనికోసం ప్రభుత్వం రూ.8,745 కోట్లు కేటాయించింది. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వరకు చదువుతున్న ప్రతి అర్హులైన విద్యార్థి ఈ పథకం లబ్ధిదారుడవుతాడని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈ పథకం అమలుపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. మంత్రులు నారా లోకేష్, పయ్యావుల కేశవ్‌లతో పాటు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. నిధుల జమ ప్రక్రియలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. సాంకేతిక కారణాలతో జాబితాలో లేని అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటే వెంటనే నిధులు విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన ‘అమ్మఒడి’ పథకంతో పోలిస్తే లబ్ధిదారుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. గతంలో 2022-23లో 83,15,341 మంది విద్యార్థుల పేర్లను పరిశీలించి, 42,61,965 మంది తల్లులకు రూ.6,392 కోట్లు జమ చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ ద్వారా లబ్ధిదారుల సంఖ్య 67,27,164కి పెరిగింది. గతంతో పోలిస్తే అదనంగా 24,65,199 మంది విద్యార్థులకు ఈ పథకం ప్రయోజనం అందనుంది.

ఈ విద్యా సంవత్సర ఆరంభానికి ముందు తల్లులకు ఇది ఒక మంచి కానుకగా నిలుస్తుందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. విద్యార్థుల చదువులకు మరింత ప్రోత్సాహం కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇప్పటికే పెన్షన్ పెంపు, అన్న క్యాంటీన్లు, మెగా డీఎస్సీ, దీపం-2 వంటి పథకాల అమలులో ఉన్న ప్రభుత్వం, ఇప్పుడు ‘తల్లికి వందనం’ పథకం ద్వారా మరో హామీని విజయవంతంగా నెరవేర్చింది.

ఈ పథకం అమలుతో విద్యార్థుల చదువు భారం తల్లిదండ్రులపై తగ్గి, రాష్ట్రంలో విద్యా రంగం మరింత అభివృద్ధి చెందనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read More : రోడ్డు లేక మృతదేహం తరలింపు

One thought on “అమరావతి నుంచి ఓ శుభవార్త!

Comments are closed.