హనీమూన్ హత్య కేసులో సంచలన మలుపు

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ‘హనీమూన్ హత్య’ కేసు ఇప్పుడు మరింత మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న సోనమ్‌పై ఆమె సొంత సోదరుడు గోవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన బావ రాజా రఘువంశీ హత్యకు తన చెల్లెలు సోనమే కారణమని, తాను వంద శాతం నమ్ముతున్నానని గోవింద్ స్పష్టం చేశారు. నేరం రుజువైతే ఆమెను ఉరి తీయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇందోర్‌కు చెందిన రాజా రఘువంశీ (29)ని సోనమ్ వివాహం చేసుకుంది. కానీ వివాహం జరిగిన నాలుగు రోజులకే పుట్టింటికి వెళ్లిపోయింది. హనీమూన్ పేరిట భర్తను తీసుకెళ్లి కిరాయి హంతకులతో హత్య చేయించిందన్న ఆరోపణలు తీవ్ర కలకలం సృష్టించాయి. ఈ నేపథ్యంలో తమ కుటుంబం సోనమ్‌తో అన్ని సంబంధాలు తెంచుకుందని గోవింద్ వెల్లడించారు. రాజా కుటుంబానికి న్యాయం జరిగేందుకు తాము న్యాయపోరాటం చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కేసులో సోనమ్‌తో పాటు ఆమె స్నేహితుడిగా ఉన్న రాజ్ కుశ్వాహా, మరో ముగ్గురు నిందితులను శిల్లాంగ్ కోర్టు 8 రోజులపాటు పోలీసు కస్టడీకి అప్పగించింది. ఇక రాజా రఘువంశీ తల్లి ఉమ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘మా కోడలు ఇంతటి దారుణానికి పాల్పడుతుందని ఊహించలేదు. వేరే వ్యక్తిపై ప్రేమ ఉంటే మా అబ్బాయిని ఎందుకు పెళ్లి చేసుకుంది? ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది?’’ అంటూ కన్నీరుమున్నీరు అయ్యారు.

నిందితుడు రాజ్ కుశ్వాహా తల్లి చున్నీదేవి మాత్రం తన కుమారుడు అమాయకుడని తెలిపారు. ‘‘20 ఏళ్ల నా అబ్బాయిని ఈ నేరంలోకి ఎవరో లాగారు. ఇంతటి ఘోర నేరం చేయగలడు కాదు’’ అని వాపోయారు. సోనమ్ తల్లి సంగీత మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. ‘‘మా అమ్మాయిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నిజానిజాలు ఇంకా బయటకు రావాల్సి ఉంది’’ అని అన్నారు.

ఇకపోతే, విచారణలో అరెస్టైన నిందితుల్లో సోనమ్ మినహా మిగిలిన నలుగురు తమ నేరాన్ని అంగీకరించినట్టు ఇండోర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తెలిపారు. హత్య జరిగే సమయంలో సోనమ్ ఘటనా స్థలంలోనే ఉండి ప్రత్యక్షంగా చూశిందని, ఆమె ప్రియుడు రాజ్ కుశ్వాహా ఇందోర్‌లోనే ఉండి మిగతా నిందితుల ప్రయాణ ఖర్చులకు డబ్బులు సమకూర్చినట్టు పోలీసులు వివరించారు.

ఈ హత్యను అమలు చేసేందుకు సోనమ్ బాగా పన్నాగం పన్నిందని విచారణలో స్పష్టం అయింది. గువాహటిలోని కామాఖ్య ఆలయంలో పూజ చేసిన తర్వాతే భౌతిక సంబంధం కలిగి ఉంటానంటూ భర్తకు షరతు విధించింది. దీంతో భర్తను ఈశాన్య భారతంలోని నాంగ్రియాట్ అడవులకు తీసుకెళ్లి, అక్కడ పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉండటంతో వెయిసావ్‌దాంగ్ జలపాతానికి తరలించి హత్య చేయించిందని పోలీసులు వెల్లడించారు. దీనికి సంబంధించి కీలకమైన సీసీటీవీ ఫుటేజీలను అధికారులు సేకరించారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

Read More : రూ.100 కోట్ల ఆస్తులు జప్తు చేసిన ఈడీ

One thought on “హనీమూన్ హత్య కేసులో సంచలన మలుపు

Comments are closed.