వైఎస్ షర్మిల అరెస్ట్…

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజధాని ప్రాంతంలో పర్యటించేందుకు యత్నించిన నేపథ్యంలో విజయవాడలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని గన్నవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు పంపారు.

వివరాల్లోకి వెళ్తే, బుధవారం ఉదయం వైఎస్ షర్మిల ఉద్దండరాయునిపాలెం వద్ద ప్రధానమంత్రి మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించనున్నట్లు ప్రకటించారు. అయితే, ఆమె పర్యటనను అడ్డుకునేందుకు పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. గన్నవరంలో ఆమెను గృహ నిర్బంధం చేసిన పోలీసులు, అనంతరం విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ వద్దకు వచ్చిన షర్మిలను అక్కడే అరెస్ట్ చేశారు.

పోలీసుల వైఖరిని ఖండిస్తూ షర్మిల కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆంధ్రరత్న భవన్ వద్ద నిరసన దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీంతో బీజేపీ కార్యకర్తలు పీసీసీ కార్యాలయంలోకి ప్రవేశించి కోడిగుడ్లతో దాడికి పాల్పడ్డారు. షర్మిల వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆమె క్షమాపణ చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.

ఈ ఘటనలో కాంగ్రెస్ మరియు బీజేపీ వర్గాల మధ్య వాగ్వివాదం తీవ్రంగా చోటుచేసుకోగా, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే పోలీసు అధికారులు జోక్యం చేసుకొని ఇరుపార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. బీజేపీ కార్యకర్తలలో కొందరిని అదుపులోకి తీసుకున్నారు. చివరకు వైఎస్ షర్మిలను అరెస్ట్ చేసి గన్నవరం విమానాశ్రయం వద్దకు తరలించి అక్కడి నుంచి హైదరాబాద్‌కు పంపించారు.

Read More : పవన్ కళ్యాణ్ పేరు … చివరికి చేర్చిన ప్రభుత్వం