కేంద్రం కీలక నిర్ణయాలు!

rammohan naidu

ఏపీ మిర్చి రైతుల సమస్యలపై కేంద్రం దృష్టి సారించిందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తితో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారని, తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారని వెల్లడించారు. శుక్రవారం జరిగిన సమావేశంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారని తెలిపారు.

మిర్చి రైతులకు కేంద్రం భరోసా

రాష్ట్రంలో మిర్చి రైతుల భరోసా కోసం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద సహాయం అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని రామ్మోహన్ నాయుడు చెప్పారు. మిర్చి ఉత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వం లెక్కించిన వ్యయం రూ.11,600గా ఉందని, రైతులకు అందే ధర మరింత పెంచేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మిర్చి ఎగుమతుల పెంపును కేంద్రం పరిశీలిస్తుందని, ఈ సమస్యపై ప్రత్యేకంగా ఎగుమతిదారులతో సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించామని వెల్లడించారు.

రైతులకు సరైన ధర కోసం కృషి

రైతుల పెట్టుబడి వ్యయం, మార్కెట్ ధర మధ్య గల అంతరాన్ని భర్తీ చేయడానికి కేంద్ర నిధులను ఉపయోగించేందుకు చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ఐసీఏఆర్ నిర్ణయించిన ధరలను రైతుల వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని సవరించాల్సిందిగా కేంద్రాన్ని కోరామని అన్నారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మిర్చి ధరను రూ.12,000కి పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని, ఇందుకు అవసరమైన ఆదేశాలను కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇప్పటికే జారీ చేశారని రామ్మోహన్ నాయుడు తెలిపారు.

త్వరలో నిర్ణయం

మిర్చి రైతుల సమస్యలపై త్వరలోనే కేంద్రం స్పష్టమైన నిర్ణయం తీసుకుంటుందని, ఎగుమతులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఏపీ ప్రభుత్వం పని చేస్తుందని రామ్మోహన్ నాయుడు చెప్పారు. రైతులకు మెరుగైన ఆదాయం కల్పించేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన హామీ ఇచ్చారు.

One thought on “కేంద్రం కీలక నిర్ణయాలు!

Comments are closed.