తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ను పూర్తిగా నిజమైన పేదలకు లబ్ధి చేకూరేలా అమలు చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. న్యాక్ (NAK)లో నిర్వహించిన ఓ శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘‘ఇందిరమ్మ ఇళ్ల పథకం రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్ఠాత్మకమైనది. దీనివల్ల ఎంతోమందికి గూడు కలిగే అవకాశం ఉంది. అర్హత లేని వారికి ఇళ్లు కేటాయించకుండా, తప్పుల్లేని విధంగా దీనిని అమలు చేయాల్సిన బాధ్యత మొత్తం ఇంజనీర్లదే’’ అన్నారు.
ఇంజనీర్లకు మంత్రి సూచనలు చేస్తూ, ‘‘ఎక్కడైనా తప్పు జరిగితే వెంటనే చర్యలు తీసుకుంటాం. టోల్ ఫ్రీ నంబర్ ద్వారా సమాచారం అందించవచ్చు. ప్రతి ఇల్లు నిజమైన అర్హులకు మాత్రమే ఇవ్వాలి. ఇందుకోసం ప్రతి దరఖాస్తును సవివరంగా పరిశీలించాలి. నిర్మాణాల్లో తలెత్తే సమస్యలను చిన్నవి అని ఊరుకోం’’ అని హెచ్చరించారు.
ఈ సందర్భంగా రిజిస్ట్రేషన్ శాఖలో పదోన్నతులు పొందిన అధికారులకు ఆర్డర్ కాపీలను మంత్రి పంపిణీ చేశారు. అలాగే గృహ నిర్మాణ శాఖకు మంచి పేరు తేవాలన్నదే అందరి లక్ష్యమవ్వాలన్నారు.
న్యాక్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న 390 మంది అసిస్టెంట్ ఇంజనీర్లకు మంత్రితో కలసి ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రభుత్వ సంకల్పం స్పష్టమని, దీనిలో ఎలాంటి రాజీ ఉండదని మంత్రి పొంగులేటి పునరుద్ఘాటించారు.

One thought on “అనర్హులకు ఇళ్లు కేటాయిస్తే కఠిన చర్యలు”
Comments are closed.