ఏపీ బడ్జెట్ 2025: సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట

schemes

ఏపీ బడ్జెట్ 2025-26: మేనిఫెస్టో హామీల అమలుకు ప్రాధాన్యం – సంక్షేమానికి పెద్దపీట

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ (Minister Payyavula Keshav) బడ్జెట్‌ను శుక్రవారం ప్రవేశపెట్టారు. 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్ తొలిసారి రూ.3 లక్షల కోట్లను దాటి కొత్త రికార్డు సృష్టించింది. ఈసారి బడ్జెట్‌లో ప్రధానంగా సూపర్ సిక్స్ పథకాలు, మేనిఫెస్టో హామీల అమలుకు అధిక కేటాయింపులు చేశారు. అభివృద్ధి మరియు సంక్షేమ రంగాలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది.

తల్లికి వందనం – విద్యార్థుల తల్లులకు ఆర్థిక సాయం

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన తల్లికి వందనం పథకం కింద ప్రతి విద్యార్థి తల్లికి రూ.15,000 నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ చేయనుంది. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే పిల్లలకు ఈ పథకం వర్తించనుంది. స్కూళ్లు ప్రారంభమయ్యే సమయానికి ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

అన్నదాత సుఖీభవ – రైతులకు ఆర్థిక మద్దతు

రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అన్నదాత సుఖీభవ పథకాన్ని మరింత విస్తరించింది. ఈ పథకం కింద ప్రతి రైతుకు రూ.20,000 కేటాయించనుంది. ఇది వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసి, రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు తీసుకున్న కీలక నిర్ణయంగా చెబుతున్నారు.

ఆరోగ్య భీమా – రూ.25 లక్షల ఆరోగ్య కవరేజ్

ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల విలువైన ఆరోగ్య భీమా పథకం అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. కార్పొరేట్ స్థాయి వైద్యసేవలు అందించేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఎన్టీఆర్ ఆరోగ్య సేవలను కొనసాగిస్తూ, ఆరోగ్య భీమాను మరింత విస్తృతంగా అమలు చేయనున్నారు.

ఉచిత విద్యుత్ – సామాజిక వర్గాలకు ప్రత్యేక సౌకర్యం

ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, చేనేతలకు ప్రత్యేకంగా ఉచిత విద్యుత్ అందించనున్నారు. చేనేత మగ్గాలపై ఆధారపడే కుటుంబాలకు 200 యూనిట్లు ఉచితం, మరమగ్గాలపై ఆధారపడే వారికీ 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నారు. నాయీ బ్రాహ్మణుల సెలూన్లకు కూడా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కల్పించనున్నారు.

గృహ నిర్మాణం – నిరుపేదలకు ఆర్థిక సహాయం

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద 7 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు వచ్చాయి. టిడ్కో ద్వారా 2 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే, ఎస్సీలకు అదనంగా రూ.50,000, ఎస్టీలకు రూ.75,000 అదనపు సాయం అందించనున్నారు.

మత్స్యకారుల సంక్షేమం – ఆర్థిక సాయం పెంపు

చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు అందించే ఆర్థిక సాయాన్ని రూ.10,000 నుండి రూ.20,000 కు పెంచారు. దీపం 2.0 పథకం కింద ప్రత్యేక నిధులు కేటాయించారు. అదేవిధంగా, ఆదరణ పథకాన్ని మళ్లీ ప్రారంభించనున్నట్టు వెల్లడించారు.

ఈ బడ్జెట్ ద్వారా రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమానికి సమతుల్యతను కాపాడుతూ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

Read More