భూసేకరణ సమస్యలతో చర్చనీయాంశం

Hyderabad Metro

హైదరాబాద్‌ మెట్రో విస్తరణపై హైకోర్టులో పిల్ – ఓల్డ్ సిటీలో పనులు ఆపాలని విజ్ఞప్తి

హైదరాబాద్‌ ఓల్డ్ సిటీలో మెట్రో రైల్ విస్తరణను ఆపాలని హైకోర్టులో పిల్ (పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్) దాఖలైంది. పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ ఈ పిల్ను దాఖలు చేసింది. ఈ కేసుపై రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ కౌంటర్ పిటీషన్ దాఖలు చేయడానికి మూడు వారాల సమయం కోరింది.

ఎంజీబీఎస్ (మహాత్మా గాంధీ బస్ స్టేషన్) నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల పొడవైన మెట్రో లైన్ నిర్మాణం కోసం 1100 ఆస్తుల భూసేకరణ చేపట్టారు. భూసేకరణలో ఎదురైన సమస్యల కారణంగా ఈ పిల్ హైకోర్టులో దాఖలైంది.

హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణను ప్రభుత్వం ఇప్పటికే అధికారికంగా ప్రకటించడంతోపాటు, పనులను కూడా ప్రారంభించింది. అయితే ఓల్డ్ సిటీలో మెట్రో పనులను నిలిపివేయాలని కోరుతూ పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై హైకోర్టు విచారణ జరిపి, తదుపరి విచారణను ఏప్రిల్ 3కి వాయిదా వేసింది.

ఇప్పటికే మెట్రో విస్తరణకు అవసరమైన భూసేకరణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. 7.5 కిలోమీటర్ల మెట్రో లైన్ను ఎంజీబీఎస్‌ నుంచి చాంద్రాయణగుట్ట వరకు నిర్మించనున్నారు. ఇది ఫేజ్-2లో మొదటి కారిడార్ కానుంది. ప్రాజెక్ట్ కోసం 1100 ఆస్తుల భూసేకరణకు ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందులో 800 ఆస్తులకు సంబంధించిన ప్రిలిమినరీ నోటిఫికేషన్ జిల్లా రెవెన్యూ అధికారులు పలు దఫాలుగా జారీ చేశారు.

ప్రైవేట్ ఆస్తులకు పరిహారం చెల్లించడం ఇప్పటికే ప్రారంభమైంది. కొన్నిచోట్ల విరిచివేతలు (డీమాలిషన్) కూడా చేపట్టారు. భూములను స్వచ్ఛందంగా ఇచ్చేందుకు ఆస్తి యజమానులు సిద్ధంగా ఉన్నప్పటికీ, కొన్ని సమస్యాత్మక ఆస్తుల విషయంలో అధికారులు సున్నితంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మెట్రో రైల్ ప్రాజెక్ట్ను నిలిపివేయాలని పిటిషన్ దాఖలు కావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Read More