పోసాని కేసు కొత్త మలుపు – విజయవాడ కోర్టు రిమాండ్ విధింపు

posani krishna murali

సినీ నటుడు పోసాని కృష్ణమురళీ కేసు వ్యవహారం మరో మలుపు తిరిగింది. విజయవాడ సీఎంఎం కోర్టు ఈ నెల 20వ తేదీ వరకు పోసానికి రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జనసేన నేత బాడిత శంకర్ ఫిర్యాదుతో భవానీపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ సహా కూటమి నేతలు, మీడియా ప్రతినిధులపై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు కేసు నమోదు చేశారు.

కర్నూలు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసానిని ప్రత్యేక వాహనంలో విజయవాడ కోర్టుకు పోలీసులు తరలించారు. విచారణ సందర్భంగా న్యాయస్థానం రిమాండ్ విధించడంతో, ఆయనను తిరిగి కర్నూలు జైలుకు తరలించనున్నారు.

అక్రమ కేసులపై పోసాని ఆగ్రహం

కోర్టు ముందు తన వాదనలు వినిపించిన పోసాని, అక్రమంగా తనపై కేసులు పెట్టారని ఆరోపించారు. ఒకే విధమైన కేసులతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు తిప్పుతున్నారని వాపోయారు. అనారోగ్య సమస్యలు ఉన్నాయన్న ఆయన, గుండె జబ్బు, పక్షవాతం సమస్యలతో బాధపడుతున్నట్టు కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

పోసాని వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా కేసులు

పోసాని అనుచిత వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. శుక్రవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ కేసులపై వాదనలు జరిగాయి. కర్నూలు జిల్లా ఆదోని అదనపు జ్యుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్ కోర్టులో పోసాని కేసుపై వాదనలు ముగిశాయి. ఆయన వయస్సు, ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు.

బెయిల్ మంజూరు చేయరాదని ప్రాసిక్యూషన్ వాదనలు

ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ మహేశ్వరి వాదనలు వినిపించారు. పోసాని వాడిన పదజాలం తీవ్రంగా ఉందని, బాధితుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా ఉందని కోర్టుకు తెలిపారు. బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

కొన్ని కేసుల్లో బెయిల్, మరికొన్ని కేసుల్లో విచారణ వాయిదా

పోసాని కేసులపై వివిధ కోర్టుల్లో విచారణ కొనసాగుతోంది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో కడప మొబైల్ కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. అయితే, పల్నాడు జిల్లా నరసరావుపేట కోర్టు పోసానిని రెండు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పోసాని దాఖలు చేసిన మరో బెయిల్ పిటిషన్‌పై విచారణ సోమవారానికి వాయిదా పడింది.

Read More

One thought on “పోసాని కేసు కొత్త మలుపు – విజయవాడ కోర్టు రిమాండ్ విధింపు

Comments are closed.