సౌత్ సినిమా హీరోయిన్ల పాత్రలపై కఠిన విమర్శలు!
సినీ నటుడు సూర్య సతీమణి, ప్రముఖ నటి జ్యోతిక దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో హీరోయిన్ల స్థితిగతులపై తన అభిప్రాయాన్ని బహిరంగంగా వెల్లడించారు. సౌత్ ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ల పాత్ర గురించి మాట్లాడితే, ఎక్కువగా హీరోతో పాటలు పాడటం, డాన్స్ చేయడం, అతన్ని ప్రశంసిస్తూ గ్లామర్ డాల్‌గా మిగిలిపోవడం మాత్రమే కనిపించేదని జ్యోతిక పేర్కొన్నారు.
“ఇప్పుడు బాలీవుడ్‌తో పాటు ఇతర చిత్ర పరిశ్రమల్లో మార్పు కనిపిస్తోంది. కథలు బలమైన మహిళా పాత్రలకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. కానీ, దక్షిణ భారత చిత్రసీమలో ఇప్పటికీ పరిస్థితి పెద్దగా మారలేదని నేను భావిస్తున్నాను,” అని జ్యోతిక తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
తన సినీ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ, “నా కెరీర్ ప్రారంభ దశలో తొమ్మిదిన్నరేళ్లు అగ్ర కథానాయకులందరితో నటించాను. ఆ తర్వాత మగ హీరోల ఆధిపత్యం ఉన్న కథలను చేయకూడదని స్పష్టంగా నిర్ణయం తీసుకున్నాను. మహిళా ప్రాధాన్య చిత్రాల వైపు అడుగులు వేశాను,” అని వివరించారు.
జ్యోతిక ఈ విధంగా చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. గత కొన్నేళ్లుగా మహిళా ప్రాధాన్యత కలిగిన కథలు వస్తున్నా, అవి మరింత ప్రోత్సాహించాల్సిన అవసరం ఉందని సినీ అభిమానులు, నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
