తెలంగాణ అభివృద్ధి, పెండింగ్ ప్రాజెక్టులపై కీలక చర్చ!

revanthreddy and modi

ప్రధాని మోదీతో సీఎం రేవంత్ భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi)తో సమావేశమయ్యారు. సుమారు గంటకు పైగా జరిగిన ఈ భేటీలో, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలపై ప్రధానితో చర్చించారు. ముఖ్యంగా, రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.

సీఎం రేవంత్ ప్రధానంగా ఐదు ముఖ్య అంశాలపై ప్రధానికి నివేదిక అందజేశారు. అందులో ఆర్‌ఆర్‌ఆర్ రింగ్ రోడ్డు, హైదరాబాద్ మెట్రో రైల్ వెస్ట్ కారిడార్ కోసం రూ.24,269 కోట్ల నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా, మూసీ నదికి పునరుజ్జీవం కల్పించే ప్రాజెక్ట్‌కు రూ.20,000 కోట్ల నిధులు కేటాయించాలని ప్రధాని మోదీకి వినతిపత్రం సమర్పించారు.

తెలంగాణలో ఐపీఎస్‌ల కొరత – కేంద్ర మద్దతు కోరిన సీఎం

సీఎం రేవంత్ రాష్ట్రంలో 29 మంది ఐపీఎస్ అధికారుల కొరత ఉందని, దీనిపై త్వరగా చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీని కోరారు. అంతేకాకుండా, తెలంగాణను సెమీ కండక్టర్ మిషన్, అడ్వాన్స్ సెమీ కండక్టర్ మరియు ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆయన ప్రధానిని వివరించారు.

పెండింగ్ ప్రాజెక్టుల వివరాలు ప్రధాని దృష్టికి

తెలంగాణ రాష్ట్రంలో గత పదేళ్లలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల వివరాలను ప్రధాని మోదీకి నివేదించిన సీఎం, విభజన చట్టంలోని పెండింగ్ సమస్యల పరిష్కారానికి కేంద్రం తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే, ఎస్‌ఎల్‌బీసీ ప్రమాద ఘటనపై కూడా ప్రధానికి వివరించారు. భేటీ అనంతరం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు కేంద్రమంత్రులను కూడా కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆయన వెంట మంత్రి శ్రీధర్ బాబు సహా పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు.

ఈ భేటీపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుండగా, తెలంగాణకు కేంద్రం నుంచి ఎలాంటి మద్దతు లభిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

Read More