అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వర్క్ ఫ్రమ్ హోమ్ సంస్కృతి మరింతగా విస్తరించాలని రాష్ట్ర కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఉద్యోగ అవకాశాలను పటిష్టం చేయడంతో పాటు యువతకు సులభంగా ఉపాధి అవకాశాలు అందించేందుకు ఈ విధానాన్ని ప్రోత్సహించాలని భావిస్తోంది. ఈ క్రమంలో వర్క్ ఫ్రమ్ హోమ్‌పై సమగ్ర అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక సర్వేను ప్రారంభించింది.
ప్రతి ఇంట్లో 18 నుంచి 50 ఏళ్ల వయస్సు గల యువత వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా సేకరిస్తున్నారు. అభ్యర్థుల విద్యార్హతలు, టెక్నికల్ స్కిల్స్, ప్రస్తుత ఉద్యోగ పరిస్థితులపై సమాచారం పొందడంతో పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలపై ఆసక్తి ఉందా అనే అంశంపై కూడా ఆరా తీస్తున్నారు. ఇప్పటికే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నవారి సమస్యలు, ఎదుర్కొంటున్న సవాళ్లను అర్థం చేసుకుని, వారికి మరింత మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ఈ క్రమంలో, ఒకే ప్రాంతంలో 20-25 మంది ఉద్యోగులు కలిసి పని చేసేలా ప్రత్యేక సెంటర్లు ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. అందుబాటులో ఉన్న ప్రైవేట్ భవనాల వినియోగంపై కూడా పరిశీలన చేపట్టింది. మార్చి 10వ తేదీ వరకు ఈ సర్వే పూర్తిచేసి, తుదిపరిశీలన కోసం ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు.
సర్వే రిపోర్టు ఆధారంగా, రాష్ట్రంలోని యువతకు మరింత పెద్ద ఎత్తున వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ప్రముఖ కంపెనీలతో సమావేశమై, కొత్త ఉపాధి అవకాశాలను తీసుకురావడానికి చర్చలు జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ దిశగా బ్రాండ్‌బ్యాండ్ కనెక్టివిటీ, వేగవంతమైన ఇంటర్నెట్, తగిన వసతుల కల్పనపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది.
భవిష్యత్తులో, సర్వే ఫలితాల ప్రకారం వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలపై అధిక ఆసక్తి ఉంటే, రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక సెంటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోనుంది. ఈ విధానం అమలులోకి వస్తే, యువతకు ఉద్యోగ అవకాశాలు పెరగడంతో పాటు, ఆర్థికంగా సుదృఢత దిశగా ముందడుగు పడే అవకాశం ఉంది.

2 thoughts on “ఆంధ్రప్రదేశ్‌లో వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాల విస్తరణకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు”
Comments are closed.