తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. హస్తిన వేదికగా దేశ రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. అవినీతి, అనుమానాస్పద మరణాలు, కేంద్ర ప్రభుత్వ వైఖరి, బీఆర్ఎస్ నేతల విమర్శలపై ఘాటుగా స్పందించారు. మరి ఆయన ఏం చెప్పారో తెలుసుకోవాలంటే ఈ వార్త చదవండి..
తెలంగాణ: సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. తెలంగాణకు సంబంధించి ఐదు కీలక అంశాలపై విజ్ఞప్తి చేశారు. ప్రధానితో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం, బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి, రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న అనుమానాస్పద మరణాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కేటీఆర్ మౌనం ఎందుకు?
కేటీఆర్ వ్యాపార భాగస్వామి కేదార్ అనుమానాస్పదంగా మృతి చెందితే, ఆయన ఎందుకు స్పందించలేదని సీఎం ప్రశ్నించారు. విచారణకు వారు సిద్ధంగా ఉన్నారా? లేదా? అని నిలదీశారు. కేదార్, కాళేశ్వరం కేసు వాదిస్తున్న న్యాయవాది సంజీవ్ రెడ్డి, ప్రజా హిత కేసు వేశిన లింగమూర్తి మృతిపై బీఆర్ఎస్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. త్వరలోనే డ్రగ్స్ కేసుపై విచారణ మొదలవుతుందని తెలిపారు.
ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు
ఎస్‌ఎల్‌బీసీ రెస్క్యూ ఆపరేషన్‌లో 11 సంస్థలు పనిచేస్తున్నాయని తెలిపారు. ప్రాజెక్టును పూర్తి చేయడం కోసం కృషి చేస్తున్నామని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కమీషన్ల కోసమే ప్రాజెక్టును వదిలేశారని ఆరోపించారు. ప్రాజెక్టు అంచనాలను సవరించినప్పటికీ, రూ.5000 కోట్లలోపు ఖర్చుతో పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని వివరించారు.
బీఆర్ఎస్ హయాంలో అవినీతి పెచ్చరిల్లింది
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ బలహీనపడినప్పటికీ, బీజేపీతో కలిసి వ్యవహరిస్తోందని విమర్శించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో అసలు ఉప ఎన్నికలు ఎలా వస్తాయో కూడా అర్థం కావడం లేదన్నారు.
ఫోన్ ట్యాపింగ్ అంశంపై కేంద్రంపై విమర్శలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో విదేశాల్లో ఉన్న వారిని తీసుకురావాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని గుర్తుచేశారు. ఈ విషయంలో కేంద్ర మంత్రులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టును కేంద్రం అడ్డుకుంటోందని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇందుకు బాధ్యత వహించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వ తరఫున తాను తన వంతు కృషి చేశానని తెలిపారు.
కేబినెట్‌కు పూర్తి స్వేచ్ఛ
స్వయంగా తన కేబినెట్‌లోని మంత్రులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు తెలిపారు. మంత్రులు తమ శాఖలను సమర్థంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. ప్రజల సంక్షేమం కోసం పథకాల అమలుపై దృష్టి పెట్టామని తెలిపారు. తెలంగాణలో తన పాలన ప్రజాస్వామ్య పరిరక్షణకు మార్గదర్శకంగా నిలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
