ఢిల్లీలో ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు కూడా పాల్గొన్నారు.
NDA సమావేశం – పవన్ కళ్యాణ్, చంద్రబాబుతో మోదీ ప్రత్యేక చర్చ
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా ప్రమాణ స్వీకారం ముగిసిన అనంతరం, ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం ఎన్డీయే నేతల కోసం ప్రత్యేక విందు కూడా ఏర్పాటు చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ సమయం కావడంతో సీఎం యోగి ఆదిత్యనాథ్ హాజరుకాలేకపోయారు. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి ప్రాధాన్యత, ప్రభుత్వాల పనితీరుపై ప్రధానంగా చర్చించిందని సమాచారం.
చంద్రబాబు, పవన్‌తో మోదీ ప్రత్యేకంగా మాట్లాడారు
సమావేశంలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో ప్రత్యేకంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఏపీలో అభివృద్ధి ప్రాజెక్టుల పురోగతి, అమరావతి రాజధాని పనుల గురించి మోదీ అడిగి తెలుసుకున్నారని సమాచారం. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయాన్ని అందిస్తుందని మోదీ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనికి చంద్రబాబు, పవన్ మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.
ఇటీవల ఏపీలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాల మధ్య విబేధాలు ఉన్నాయంటూ ఓ ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా వైసీపీ నేతలు దీనిపై విమర్శలు గుప్పించారు. అయితే, ప్రధాని మోదీ పవన్, చంద్రబాబుతో ప్రత్యేకంగా మాట్లాడడం ద్వారా ఆ ప్రచారానికి చెక్ పెట్టినట్లు కనిపిస్తోంది. వేదికపై మోదీ పవన్, చంద్రబాబుతో చమత్కారంగా మాట్లాడారు. ఇతర ఎన్డీయే నేతల కంటే పవన్, చంద్రబాబుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఎన్డీయేలో విబేధాలు లేవు – పవన్ కళ్యాణ్
సమావేశం అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జాతీయ మీడియాతో మాట్లాడారు. ఏపీలో ఎన్డీయే భాగస్వామ్య పార్టీల మధ్య విభేదాలేవీ లేవని స్పష్టం చేశారు. కొన్ని సమావేశాలకు హాజరుకాలేకపోవడానికి తన ఆరోగ్య సమస్యలే కారణమని చెప్పారు. ప్రస్తుతం కూడా వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు తెలిపారు. ఏపీ ప్రభుత్వంగా ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై కట్టుబడి ఉన్నామని, అన్నీ హామీలు నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని పవన్ వివరించారు.
ఇదే సందర్భంలో, ఎన్డీయే ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు సమన్వయంతో ముందుకు వెళ్లాలని ప్రధాని మోదీ సూచించినట్లు సమాచారం.
