“తెలంగాణ అసెంబ్లీ నాలుగో రోజు సమావేశాలు: ముఖ్య బిల్లుల ప్రవేశం, స‌మావేశంలో నేతల వేషాలు”

నాలుగో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల బడ్జెట్ సమావేశాలు నాలుగో రోజు బుధవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. ఈ రోజు మొదట ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతుంది. అనంతరం ప్రభుత్వం సభలో రెండు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది.

టెலంగానా పెమెంట్స్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్స్ సవరణ బిల్లును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ భూ భారతి బిల్ 2024ను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ రెండు బిల్లులపై చర్చ జరగనుంది మరియు శాసనసభ ఆమోదం తెలిపే అవకాశముంది. అలాగే, ఈ రోజు అసెంబ్లీలో గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల పై లఘు చర్చ జరుగుతుంది.

రోజుకో వేషం..

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ సమావేశాలకు రోజుకో వేషంతో వస్తున్నారు. మంగళవారం నల్ల చొక్కలు ధరించిన నేతలు ఈ రోజు ఆటో డ్రైవర్ల వేషంలో అసెంబ్లీకి వచ్చారు. మొదటి రోజు అదానీ, రాహుల్ గాంధీ టీషర్ట్స్‌లో అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నిన్న నల్ల చొక్కాలు ధరించి, బేడీలతో అసెంబ్లీకి వచ్చారు. లగచర్ల రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బేడీలు ధరించారు. ఆటో డ్రైవర్ల సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలని ఈ రోజు బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేయనున్నారు.

ఇక, అసెంబ్లీ ఆవరణలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. “ఆటో కార్మికుల యూనిఫాంలో ఎలా ఉన్నామో చూడండి” అంటూ వేముల ప్రశాంత్ రెడ్డి, కూనంనేని సాంబశివరావును వ్యాఖ్యానించారు. “కార్మికుల యూనిఫామ్ పవర్ ఏంటో ఇప్పటికైనా తెలుసుకున్నారా?” అని కూనంనేని సాంబశివరావు ప్రతిస్పందించారు. “మీరు మాతోపాటు యూనిఫామ్ వేసుకోకుండా దూరమయ్యారు” అని ప్రశాంత్ రెడ్డి చెప్పారు. దీనిపై కూనంనేని సాంబశివరావు స్పందిస్తూ “మేము దూరం కాలేదు, మీరు మాతో దూరం చేసుకున్నారు” అని సమాధానం ఇచ్చారు.