సినిమా పరిశ్రమ ఓ రంగుల ప్రపంచం.. పైకి కనిపించే అంత అందంగా లోపల కూడా ఉంటుందా అంటే అదో పెద్ద ప్రశ్న? నటీనటుల విషయానికొస్తే సినిమా పరిశ్రమలో తమకు అనిపించింది మాట్లాడడానికి చాలా ధైర్యం కావాలి. అయితే, అలాంటి గట్స్ ఉన్న అతి కొద్ది మంది నటీమణుల్లో మాళవిక మోహన్ ఒకరు. 2013లో ‘పట్టం పోలే’ అనే మలయాళ చిత్రం ద్వారా నటిగా రంగప్రవేశం చేసిన ఈ అమ్మడు ఆ తరువాత కన్నడం, హిందీ, తమిళం చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా ‘ది రాజాసాబ్’ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. రజనీకాంత్ హీరోగా నటించిన ‘పేట’ చిత్రంతో కోలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ తొలి చిత్రంతోనే పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టి సినీ ప్రముఖల దృష్టిలో పడ్డారు. ఆ తరువాత విజయ్ సరసన మాస్టర్, ధనుష్ కు జంటగా మారన్, విక్రమ్ హీరోగా నటించిన తంగలాన్ తదితర చిత్రాల్లో నటించి, తానేమిటో నిరూపించుకుంది ఈ భామ.
ప్రస్తుతం తెలుగు చిత్రం ది రాజాసాబ్ తోపాటు తమిళంలో కార్తీకి జంటగా ‘సర్దార్-2’ చిత్రంలోనూ నటిస్తోంది. తాను అనుకున్నది నిర్మొహమాటంగా వ్యక్తం చేసే ఈమె ఇటీవల ఒక సమావేశంలో మాట్లాడుతూ.. సినిమా పరిశ్రమలో ఆడ, మగ అనే తారతమ్యం ఉండకూడదన్నారు. అయితే అది ఇక్కడ చాలా ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. హీరోలకు దొరికే మర్యాద హీరోయిన్స్ కు ఇక్కడ ఇవ్వరని అన్నారు. పారితోషికం విషయంలోనూ సమానత్వం లేదని చెప్పుకొచ్చారు. హీరోలకు రెమ్యునరేషన్ అడిగినంత ఇస్తున్నారని, హీరోయిన్లకు మాత్రం తగ్గించి ఇస్తున్నారని పేర్కొన్నారు. ఈ పక్షపాత ధోరణి మారాలన్నారు.
ఇకపోతే సినిమాలో కొందరు నటులు ఉన్నారని, వారు మహిళల మధ్య మంచి వారిగా కనిపించే ప్రయత్నం చేస్తారన్నారు. అలాంటి మేకవన్నె పులులు సమయం వచ్చినప్పుడు వారి అసలు రంగును బయట పెడతారని చెప్పారు. అలా గత 5 ఏళ్లుగా ముఖానికి అందమైన మాస్క్ వేసుకున్న పలువురు నటులను తాను చూశానని ఆ అమ్మడు చెప్పారు. వాళ్లంతా బుద్ధిమంతులు అని భావించరాదనీ ఏయే సమయాల్లో నటీమణులతో మంచిగా ఉండాలన్నది వారికి బాగా తెలుసన్నారు. కానీ, కెమెరా వెనుక వారు ఎలా మారుతారు అన్నది తాను కళ్లారా చూశానని నటి మాళవిక మోహన్ చెప్పడంతో అసలు ఏం జరిగిందో అని సినీప్రియులు ఆశ్చర్యపోతున్నారు. ఈ బ్యూటీ ఎప్పుడు ఎక్కడ ఎలాంటి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారోగానీ, ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read More : మేఘాలయ హనీమూన్ హత్య కేసుపై ఆధారంగా సినిమా..?

One thought on “హీరోలలో మేకవన్నె పులులను కళ్ళారా చూసాను – మాళవిక”
Comments are closed.