బెట్టింగ్ బాధితులపై జగన్ పరామర్శ ఏంటని ప్రశ్న

పల్నాడులో బెట్టింగ్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి కుటుంబాన్ని వైఎస్సార్‌ కాంగ్రెస్ అధినేత, మాజీ సీఎం జగన్ పరామర్శించడంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రంగా స్పందించారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘‘బెట్టింగ్‌లో ప్రాణాలు కోల్పోయిన వారికి పరామర్శ ఎందుకు? వారికి విగ్రహాలు కడతారేంటి? ఇది సమాజాన్ని ఎటు తీసుకెళ్తుంది?’’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

ప్రజా సమస్యలపై పోరాడాలి, బల ప్రదర్శనలు కాదు

‘‘జగన్‌ ప్రజా సమస్యలపై పోరాటం చేయాలి. బల ప్రదర్శనలు చేస్తూ ప్రాణాల్ని తీయడమేంటని ప్రశ్నించారు. బీజేపీకి జగన్‌ దత్తపుత్రుడిగా వ్యవహరిస్తున్నారు కనుకే ఆయనకు అన్ని అనుమతులు లభిస్తున్నాయి. కానీ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న కాంగ్రెస్ నేతలకే ఆంక్షలు విధిస్తున్నారు’’ అని ఆరోపించారు.

జగన్ స్పందించాలి – షర్మిల డిమాండ్

‘‘బెట్టింగ్‌లో చనిపోయిన వారికి విగ్రహాలు కడతారా? జగన్‌ నిజమైన ప్రజా నాయకుడైతే, రాజధాని, పోలవరం, ప్రత్యేక హోదా వంటి అంశాలపై పోరాటం చేయాలి. సూపర్ సిక్స్ ఏమైంది? ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆపాలి. ఈ ఘటనపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి, బాధ్యులను శిక్షించాలి’’ అని షర్మిల డిమాండ్ చేశారు.

Read More : నారా లోకేశ్ – టోనీ బ్లెయిర్, మాండవీయతో కీలక భేటీలు