ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ఢిల్లీలో రెండో రోజు పర్యటనను కొనసాగించారు. గురువారం ఆయన బ్రిటన్ మాజీ ప్రధాని, టోనీ బ్లెయిర్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ (TBI) వ్యవస్థాపకుడు టోనీ బ్లెయిర్‌తో తాజ్ ప్యాలెస్‌లో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాలు, విద్యా రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్ వినియోగం, నైపుణ్యాభివృద్ధి ఎజెండా తదితర అంశాలపై ఇద్దరు నేతలు సమీక్షించారు.
ఇప్పటికే 2024 డిసెంబర్‌లో ఏపీ ప్రభుత్వం, టీబీఐ మధ్య ఒక కీలక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం మేరకు టీబీఐ విజయవాడలో తమ ఎంబెడెడ్ బృందాన్ని నియమించి, ఉన్నత విద్యా రంగంలో సంస్కరణలు, గ్లోబల్ ఇనిస్టిట్యూట్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (GiGG) స్థాపనపై దృష్టిసారిస్తోంది. విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, టీబీఐ ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొన్నారు. లోకేశ్, టోనీ బ్లెయిర్‌ను GiGG సలహా బోర్డులో చేరాలని ఆహ్వానించారు.
ఇక, రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హబ్‌గా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో, మంత్రి లోకేశ్ కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాలు, కార్మిక మరియు ఉపాధి శాఖల మంత్రి మన్సుఖ్ మాండవీయను కూడా కలిశారు. అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి కేంద్ర సహకారాన్ని కోరారు. తిరుపతిలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) రీజనల్ సెంటర్ ఏర్పాటు, రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఖేలో ఇండియా కేంద్రాల ఏర్పాటు, విదేశీ ఉపాధి అవకాశాలకు తగిన శిక్షణా కార్యక్రమాలపై చర్చ జరిగింది.
ఈ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన మంత్రి మాండవీయ… ఏపీని స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ESI ఆసుపత్రుల సేవలను మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Read More : ప్రజల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్న CM ప్రభుత్వం

One thought on “నారా లోకేశ్ – టోనీ బ్లెయిర్, మాండవీయతో కీలక భేటీలు”
Comments are closed.