ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదాయార్జన శాఖలపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పన్నుల వసూళ్లపై కీలక సూచనలు చేస్తూ, అవగాహన కల్పించడంపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. వ్యాపారులు, పన్ను చెల్లింపుదారులపై వేధింపులు జరగకూడదని స్పష్టం చేశారు.
వసూళ్ల విషయంలో వ్యవస్థలోని లొసుగులను ఉపయోగించుకుని ఎవరైనా రెవెన్యూకు గండి కొడితే కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని సీఎం హెచ్చరించారు. 2017 నుండి పన్ను చెల్లింపుల డేటాను విశ్లేషించాలని సూచించారు. పన్ను ఎగవేతదారులకు ఇప్పిస్తున్న ప్రోత్సాహాలపై పునరాలోచన అవసరమని తెలిపారు.
ప్రజల అభిప్రాయాలతో మార్గనిర్దేశం
ప్రభుత్వ శాఖల పన్ను వసూళ్లపై ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించాలని, వారి సంతృప్తి కూటమి ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమని చెప్పారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.1.24 లక్షల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని, రెవెన్యూ పెరిగితే అభివృద్ధి, సంక్షేమానికి మరింత వెసులుబాటు లభిస్తుందని సీఎం పేర్కొన్నారు.
వీడియో కాన్ఫరెన్సు ద్వారా సూచనలు
రాష్ట్రవ్యాప్తంగా జీఎస్టీ, వాణిజ్య పన్నుల వసూళ్లపై జాయింట్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించిన చంద్రబాబు, ఉత్తమ ఫలితాలు సాధించిన చిత్తూరు, కర్నూలు, కాకినాడ, అనంతపురం, నెల్లూరు అధికారులను అభినందించారు. గత ప్రభుత్వ హయాంలో తలెత్తిన ఆర్థిక సమస్యలు సరిచేయకపోతే రాష్ట్రం శాశ్వతంగా ఇబ్బందుల్లో పడుతుందని హెచ్చరించారు.
ఆదాయ వృద్ధిలో గణనీయమైన పురోగతి
గతేడాదితో పోలిస్తే రెవెన్యూ వసూళ్లు పెరిగినట్టు అధికారులు వివరించారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో 2025 ఏప్రిల్‌లో రూ.906.12 కోట్లు, మే నెలలో రూ.916 కోట్లు వసూలయ్యాయి. గత ఏడాది ఇదే సమయంలో వీటితో పోలిస్తే అధిక ఆదాయం నమోదైందని తెలిపారు. జీఎస్టీ ఆదాయం 5.71% మేర పెరిగిందని వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.43,020 కోట్ల వసూళ్లు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
మద్యం, గనుల, అటవీ శాఖలపై దృష్టి
నూతన మద్యం విధానం అమలు ద్వారా రాష్ట్ర ఆదాయం రూ.2,432 కోట్లు పెరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. గనుల శాఖలో ఉపగ్రహ సమాచారం ఆధారంగా డేటాను సేకరించి ఆదాయాన్ని 30–40% వరకు పెంచే అవకాశముందని సీఎంకు వివరించారు. ఎర్రచందనం అమ్మకాలు అంతర్జాతీయ ధరలను బేరీజు వేసి చేపట్టాలని సీఎం ఆదేశించారు.
పనితీరు ఆధారంగా పోస్టింగులు – సేవలు యూజర్ ఫ్రెండ్లీగా
ఉత్తమ ప్రతిభ కనబరిచే అధికారులను ఆదాయార్జన శాఖల్లో నియమించాలన్న సీఎం, సరైన వ్యక్తులు సరైన స్థానాల్లో ఉంటేనే మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ సేవలు ప్రజలకోసం మరింత సులభంగా ఉండాలని సూచించారు. ఆదాయ వనరుల కోసం కొత్త మార్గాలు అన్వేషించాలని ఆయన స్పష్టం చేశారు.
Read More : కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌కు లోకేశ్ విజ్ఞప్తి

2 thoughts on “పన్నుల వసూళ్లపై సీఎం కీలక దిశానిర్దేశం”
Comments are closed.