స్టార్‌లింక్‌కు భారత ప్రభుత్వం లైసెన్స్

భారతదేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందించేందుకు ప్రముఖ అమెరికన్ బహుళజాతీయ సంస్థ స్పేస్‌ఎక్స్‌కు చెందిన స్టార్‌లింక్‌కు కేంద్ర ప్రభుత్వం లైసెన్స్ మంజూరు చేసింది. ఈ పరిణామంపై సంస్థ ఆనందం వ్యక్తం చేసింది. కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా బుధవారం స్పేస్‌ఎక్స్ అధ్యక్షురాలు మరియు సీఓఓ గ్వినే షాట్‌వెల్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీ విజయవంతంగా ముగిసిందని మంత్రి తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి సింధియా “డిజిటల్ ఇండియాను మరింత బలోపేతం చేయడంలో శాటిలైట్ కమ్యూనికేషన్ కీలకంగా మారనుంది. స్పేస్‌ఎక్స్‌తో భారత దేశంలోని మారుమూల ప్రాంతాలకు హై-స్పీడ్ ఇంటర్నెట్ అందించే అంశంపై లోతుగా చర్చించాం,” అని అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం డిజిటల్ విప్లవ దిశగా ముందుకెళ్తోందని ఆయన పేర్కొన్నారు.

స్టార్‌లింక్‌కు జీఎంపీసీఎస్ అనుమతి మంజూరైంది. దేశంలో వాణిజ్య సేవల కోసం కంపెనీ అందించిన భద్రతా ప్రమాణాలు, నిబంధనలు పూర్తి స్థాయిలో అనుసరించడంతో కేంద్రం ఈ అనుమతిని జారీ చేసింది. స్పెక్ట్రమ్ కేటాయింపుపై పరిశీలన జరుగుతున్నదిగా సమాచారం. ఇప్పటికే ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (IN-SPACe) వద్ద అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంది.

స్టార్‌లింక్ తక్కువ భూకక్ష్య శాటిలైట్ల ద్వారా మారుమూల గ్రామాల్లోనూ వేగవంతమైన ఇంటర్నెట్ అందించేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది. వచ్చే ఏడాది ప్రారంభంలో భారత్‌లో తమ సేవలు ప్రారంభించే అవకాశముందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.

జియో-ఎస్ఈఎస్, యూటెల్‌సాట్ వన్‌వెబ్ తర్వాత దేశంలో GMPCTS లైసెన్స్ పొందిన మూడో శాట్‌కామ్ సంస్థగా స్టార్‌లింక్ గుర్తింపు పొందడం గమనార్హం.

Read More : సాంకేతిక రంగంలో మరో ముందడుగు వేసిన గూగుల్.