గవర్నర్ ప్రసంగం ద్వారా కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడిందన్న కల్వకుంట్ల తారక రామారావు

KTR

లంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగం పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) తీవ్ర విమర్శలు చేశారు. గవర్నర్ ప్రసంగం కాంగ్రెస్ పార్టీ ప్రణాళికతో కూడిన రాజకీయ డ్రామాగా మారిందని ఆయన ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడిన కేటీఆర్, గవర్నర్ ప్రసంగం గాంధీ భవన్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు చేసే ప్రసంగాన్ని తలపించిందని ఎద్దేవా చేశారు.

కేటీఆర్ ఆరోపణల్లో, గవర్నర్ ప్రసంగంలో రైతు భరోసా, రుణమాఫీపై అసత్య ప్రచారం జరిగిందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక్క గ్రామంలో కూడా 100 శాతం రుణమాఫీ పూర్తికాలేదని ధ్వజమెత్తారు. రుణమాఫీ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏ వేదికపైనైనా చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.

తేదీ, సమయం, ప్రదేశం ఏదైనా చర్చకు సిద్ధమని కేటీఆర్ ఛాలెంజ్ చేశారు. గవర్నర్ ప్రసంగం ద్వారా కాంగ్రెస్ పార్టీ అసలైన నీచ రాజకీయాలు బయటపడిపోయాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీసీల తరపున మాట్లాడిన ఓ ఎమ్మెల్సీని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడం దారుణమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కుల గణన పేరుతో బీసీలను మోసం చేసిందని విమర్శించారు.

సచివాలయంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ తల్లి విగ్రహం, రాహుల్ గాంధీ తండ్రి విగ్రహాన్ని ప్యాక్ చేసి గాంధీ భవన్‌కు పంపుతామని హెచ్చరించారు. కేసీఆర్‌పై ఉన్న కక్షతో సీఎం రేవంత్ రెడ్డి రైతులను ఇబ్బంది పెడుతున్నారని, ఆయన చేతకానితనంతో రాష్ట్రంలోని పంటలు ఎండిపోతున్నాయని దుయ్యబట్టారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రాధాన్యతలు వేరే కాబట్టే రాష్ట్రంలో 20 శాతం కమీషన్ లేకపోతే బిల్లులు పాస్ కావడం లేదని ఆరోపించారు. ఈ క్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తన ఛాంబర్ ముందు బైఠాయించాల్సిన పరిస్థితి వచ్చినదని విమర్శించారు. 30 శాతం కమీషన్ ఇవ్వకపోతే మంత్రులు పనిచేయడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెబుతున్నారని పేర్కొన్నారు.

దావోస్ పర్యటన సందర్భంగా రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చివరగా సీఎం రేవంత్ రెడ్డి తన సోదరుల కోసమే పనిచేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.

Read More

2 thoughts on “గవర్నర్ ప్రసంగం ద్వారా కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడిందన్న కల్వకుంట్ల తారక రామారావు

Comments are closed.