క్యాబినెట్ కీలక నిర్ణయాలు: అమరావతిలో భవనాల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్

క్యాబినెట్ సమావేశం: సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో కీలక చర్చలు

అమరావతి:
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో గురువారం ఉదయం 11 గంటలకు క్యాబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రాజధాని నిర్మాణాలకు అనుమతుల విషయంలో చర్చలు జరగనున్నాయి.

42వ, 43వ సిఆర్డీఏ అధికారి సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలపై క్యాబినెట్‌లో సమీక్ష ఉంటుంది. రూ. 8821.44 కోట్ల వ్యయంతో ట్రంక్ రోడ్లు, లే అవుట్ రోడ్లపై చర్చ జరగనుంది. ఎల్‌పీఎస్ రోడ్ల కోసం రూ. 3807 కోట్లు, ట్రంక్ రోడ్లకు రూ. 4521 కోట్లు, జడ్జిలు, మంత్రుల బంగ్లాలకు రూ. 492 కోట్లు ఖర్చు చేయనున్నారు. అమరావతిలో 236 కిలోమీటర్ల రోడ్ల లేఅవుట్‌లకు అనుమతి ఇస్తూ, ఈ రోజు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది.

అమరావతిలో భవనాల నిర్మాణం:

  • జిఏడి టవర్: బేస్మెంట్ +39 ఆఫీస్ ఫ్లోర్లు + టెర్రస్ ఫ్లోర్లు కలిపి 17 లక్షల 3 వేల 433 చదరపు అడుగుల నిర్మాణానికి చర్చ జరుగుతుంది.
  • హెచ్‌వోడి టవర్స్ 1, 2: బేస్మెంట్ +39 ఫ్లోర్లు + టెర్రస్ నిర్మాణం ద్వారా 28 లక్షల 41 వేల 675 చదరపు అడుగుల నిర్మాణానికి అనుమతి పొందనున్నారు.
  • హెచ్‌వోడి టవర్స్ 3, 4: బేస్మెంట్ +39 ఫ్లోర్లు + టెర్రస్ ద్వారా 23 లక్షల 42 వేల 956 చదరపు అడుగుల నిర్మాణం చేపట్టనున్నారు.
  • అసెంబ్లీ భవనం: 250 మీటర్ల ఎత్తుతో 11.22 లక్షల చదరపు అడుగుల నిర్మాణానికి చర్చ జరుగుతుంది.
  • హైకోర్టు భవనం: 55 మీటర్ల ఎత్తుతో 20.32 లక్షల చదరపు అడుగుల నిర్మాణం మంజూరు చేయనున్నారు.

మొత్తం వ్యయం:

  • భవనాల నిర్మాణానికి రూ. 6465 కోట్లు.
  • ఎల్‌పీఎస్ లేఅవుట్‌ల మౌళిక వసతులకు రూ. 9699 కోట్లు.
  • ట్రంక్ రోడ్లకు రూ. 7794 కోట్లు.
  • ఎస్టీపీ పనులకు రూ. 318 కోట్లు.

ఇతర చర్చలు:
కాకినాడ పోర్టు నుంచి తరలిస్తున్న ఓడలో పిడిఎస్ బియ్యం వ్యవహారం, విజయవాడ బుడమేరు ముంపు బాధితులకు రుణాల రీషెడ్యూల్, పలు పరిశ్రమలకు భూకేటాయింపుల అంశాలపై కూడా సమావేశంలో చర్చ జరగనుంది.

సిఎం పోలవరం పర్యటన:
సిఎం పోలవరం పర్యటన, టైం షెడ్యూల్‌పై కూడా కేబినెట్ సమావేశంలో కీలకంగా చర్చించనున్నారు.