ఆర్‌సీబీ విజ‌యోత్స‌వం మ‌ర‌ణ‌మయ‌మైంది.

విజ‌య‌వాడ నగరంలో మంగళవారం అర్ధరాత్రి రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్‌సీబీ) క్రికెట్ జట్టు విజ‌యాన్ని వేడుక‌ల్లో ఘ‌నంగా జరుపుకున్న అభిమానుల సంబ‌రాలు విషాదంలో ముగిశాయి. విజ‌యోత్సవ ర్యాలీలో పాల్గొన్న యువ‌కుడు రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడు.

వివ‌రాల్లోకి వెళితే… వించిపేట‌కు చెందిన తాడిగిరి శేఖర్ (30) అనే యువ‌కుడు రైల్వే పార్సిల్ కార్యాల‌యంలో పనిచేస్తున్నాడు. మంగళవారం అర్ధరాత్రి ఆర్‌సీబీ గెలిచిందని తెలుసుకుని, తన మిత్రులు శ్రీనాథ్, ఉదయ్‌కుమార్‌లతో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. రాత్రి సుమారు 12.15 గంట‌ల సమయంలో బందరు రోడ్డులోని చైత‌న్య కాలేజీ సమీపంలో వారు ప్రయాణిస్తున్న బైక్ అదుపు తప్పి కింద పడింది. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన కారు శేఖర్‌ను ఢీకొట్టింది.

తీవ్ర గాయాల‌తో ఆసుపత్రికి తరలించిన శేఖర్ చికిత్స పొందుతూ అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు సీఐ ప్రకాశ్ తెలిపారు.

అతి ఉత్తేజంతో ఫ్యాన్స్ వీరంగం

ఆర్‌సీబీ విజయంతో ఉల్లాసంలో మునిగిపోయిన అభిమానులు నగరంలో నియమాలు, నిబంధనలను లెక్కచేయకుండా ఆందోళనకరంగా ప్రవర్తించారు. డివైడర్లలో మొక్కలు పీకివేయడం, బారికేడ్లను బైకులకు కట్టి లాగడం, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపైకి ఎక్కి హంగామా చేయడం వంటి చర్యలతో పౌరుల భద్రత ప్రశ్నార్థకమైంది.

యాభై మందికిపైగా బస్సులపైకి ఎక్కి శబ్దాలు చేసి ప్రయాణికులలో భయం కలిగించారు. వీరంగం సృష్టించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. యువత తీరుపై నగర ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Read More : విజయవాడలో చిన్నారులతో జగన్