గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నేత వల్లభనేని వంశీకి కోర్టు మరోసారి రిమాండ్ షాక్ ఇచ్చింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఆయనకు సంబంధించి రిమాండ్‌ను జూన్ 22వ తేదీ వరకు పొడిగిస్తూ ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. వంశీ కస్టడీ ముగియడంతో పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. తదుపరి విచారణ వరకు ఆయనను జైలుకు తరలించనున్నారు.
సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుతో పాటు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో కూడా వల్లభనేని వంశీ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయనతో పాటు వెలినేని శివరామకృష్ణ ప్రసాద్, గంటా వీర్రాజు, నిమ్మ చలపతి, వేల్పూరు వంశీబాబు విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.
ఈ కేసులో మరో ప్రధాన నిందితుడు, వంశీ అనుచరుడు కొమ్మా కోటేశ్వరరావు అలియాస్ కోట్లు సహా కొంతమంది నిందితులు ఇప్పటికీ నేపాల్లో ఉన్నారు. వారిలో కొందరు విశాఖ నుంచి శ్రీకాకుళం వైపు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. కోట్లు తదితరులు రాత్రి సమయాల్లో ఫోన్లు చేస్తూ కేసు పురోగతిని సన్నిహితులతో చర్చిస్తున్నట్లు సమాచారం.
ఇక, టీడీపీ కార్యాలయంపై దాడి వ్యవహారంలో అరెస్టయిన ఓలుపల్లి మోహనరంగారావు అలియాస్ రంగాను కిడ్నాప్ కేసులో పీటీ వారంటు ద్వారా కోర్టులో హాజరుపరచేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. కేసులో కీలకమైన 12 మంది నిందితుల్లో ఇప్పటికీ ఆరుగురు పరారీలో ఉన్నారు. వారిని త్వరలో అరెస్టు చేయాలని పోలీసులు చర్యలు చేపట్టారు.
Read More : పవన్ కుమారుడికి గాయాలు – ఘటనపై జగన్ సహా పలువురు ప్రముఖుల స్పందన.

One thought on “వల్లభనేని వంశీకి కోర్టులో మరోసారి షాక్ – రిమాండ్ జూన్ 22వ తేదీ వరకు పొడిగింపు”
Comments are closed.