August 1 : అధిక సుంకాల అమలుపై అమెరికా గడువు

వాణిజ్య భాగస్వామ్య దేశాలపై అధిక సుంకాలు విధించేందుకు అమెరికా సిద్ధంగా ఉంది. ఇందులో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఇప్పటికే తాము ప్రకటించిన ప్రకారం, ఆగస్టు 1 నుంచి కొత్త టారిఫ్‌లు అమల్లోకి రానున్నాయని తెలిపారు. ఈ మేరకు జూలై 9లోగా సుంకాల రేట్ల వివరాలను ఆయా దేశాలకు తెలియజేయనున్నట్లు ట్రంప్ వెల్లడించారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందాలను ఖరారు చేయడానికి తుది దశ చర్చలు కొనసాగుతున్నాయని ట్రంప్ చెప్పారు. నిర్ణయం తీసుకోడంలో ఆలస్యం చేసే దేశాలకు అధిక సుంకాలు తప్పవని హెచ్చరించారు. ఇందుకోసం సుమారు 12 దేశాలకు లేఖలు సిద్ధం చేశామని, అవి సోమవారం చేరే అవకాశం ఉందని ఆయన వివరించారు. “ప్రతి దేశంతో విడివిడిగా చర్చలకుపోయే బదులు, మా నిబంధనలతో లేఖ పంపడం సులభం” అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లూట్నిక్ మాట్లాడుతూ, ఆగస్టు 1 నుంచే కొత్త సుంకాలు అమలులోకి వస్తాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం ట్రంప్ సుంకాల రేట్లు, ఒప్పందాల తుది రూపకల్పన పనిలో ఉన్నారని తెలిపారు. ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెస్సెంట్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. “ఏప్రిల్ 2 నాటి సుంకాల స్థాయికి తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఈ నేపథ్యంలో ఒప్పందాలపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాల్సిందే” అని పేర్కొన్నారు.

గత ఏప్రిల్‌లో ట్రంప్ ప్రభుత్వం 10 శాతం మూల సుంకం, అదనంగా 50 శాతం వరకు సుంకాలను ప్రకటించినా.. అంతర్జాతీయంగా ఆందోళనలు వెల్లువెత్తడంతో వాటిని తాత్కాలికంగా వాయిదా వేసింది. ఇప్పుడు, ఆగస్టు 1ని గడువుగా నిర్ణయించడం ద్వారా, ఒప్పందాలను చేరుకోవడానికి దేశాలకు చివరి మూడు వారాల సమయం లభించింది.

ఇప్పటికే అమెరికా యూకే, వియత్నాం దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకోగా.. చైనా ఉత్పత్తులపై ఉన్న అధిక సుంకాలను తాత్కాలికంగా తగ్గించేందుకు అంగీకరించింది.

Read More : Plane : ప్రయాణికుల ఆందోళన, పలువురు గాయాలు