కాంగోలో మిస్టరీ వైరస్ కలకలం – 48 గంటల్లో 50 మంది మృతి!

Mystery virus wreaks havoc in Congo

కాంగోలో ఓ అపరిచితమైన ప్రాణాంతక వైరస్ విజృంభిస్తోంది. కేవలం 48 గంటల వ్యవధిలోనే 50 మందికి పైగా మరణించడంతో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యాధికి సంబంధించిన లక్షణాలు జ్వరం, వాంతులు, అంతర్గత రక్తస్రావంగా (ఇంటర్నల్ బ్లీడింగ్) కనబడుతున్నాయి. అయితే ఇప్పటివరకు ఈ వైరస్‌ను స్పష్టంగా గుర్తించలేకపోయారు.

పశ్చిమ కాంగో ప్రాంతంలో ఈ వైరస్ మొదటగా గబ్బిలం తిన్న ముగ్గురు చిన్నారులకు సోకిందని, అతి తక్కువ సమయంలోనే మరికొందరికి వ్యాపించి 50 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. బికోరో హాస్పిటల్ డైరెక్టర్ సెర్జ్ న్గలేబాటో తెలిపిన వివరాల ప్రకారం, ఈ వ్యాధి లక్షణాలు ఎబోలా, డెంగ్యూ, మార్బర్గ్, ఎల్లో ఫీవర్‌లతో పోలికలు ఉన్నప్పటికీ, ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల్లో వాటితో సంబంధం లేదని తేలింది. జనవరి 21 నుంచి ఇప్పటి వరకు 419 కేసులు నమోదు కాగా, 53 మంది మరణించినట్లు సమాచారం.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, బోలోకో గ్రామంలో ముగ్గురు పిల్లలు గబ్బిలం తినడంతో ఈ వ్యాధి మొదలైందని, ఫిబ్రవరి 9న మరోసారి బోమాటే గ్రామంలో వ్యాప్తి చెందిందని తెలిపింది. ప్రాథమిక పరీక్షల్లో హెమరేజిక్ ఫీవర్‌ వైరస్‌లతో ఈ వ్యాధికి సంబంధం లేదని తేలింది. అయితే కొన్ని నమూనాల్లో మలేరియా పాజిటివ్‌గా గుర్తించినట్లు డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించింది.

ఇప్పటివరకు ఈ వైరస్ పేరు కానీ, వ్యాధి పేరు కానీ శాస్త్రవేత్తలు కనుగొనలేదు. ఈ వ్యాధి మరింతగా వ్యాపించే ప్రమాదం ఉండటంతో, దీన్ని అడ్డుకోవడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Read More

One thought on “కాంగోలో మిస్టరీ వైరస్ కలకలం – 48 గంటల్లో 50 మంది మృతి!

Comments are closed.