భారత్, చైనా ఉత్పత్తులపై 500% సుంకాలు?

ఉక్రెయిన్‌పై రష్యా దాడి కొనసాగుతున్న నేపథ్యంలో, మాస్కోతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్న దేశాలపై ఆంక్షలు విధించే దిశగా అమెరికా మరో కీలక అడుగు వేసింది. రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం రూపొందించిన ఓ కొత్త బిల్లుకు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు తెలిపారు. ఈ బిల్లు ప్రకారం రష్యాతో వ్యాపారం చేస్తున్న భారత్, చైనా లాంటి దేశాల ఉత్పత్తులపై 500 శాతం దిగుమతి సుంకం విధించనున్నారు.

బిల్లు ఉద్దేశం ఏంటి?
రష్యా చమురు అమ్మకాల ద్వారా ఆర్థికంగా బలపడుతున్న నేపథ్యంలో, రష్యా ఆదాయాన్ని దెబ్బతీయడమే ఈ బిల్లు లక్ష్యం. ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే దిశగా పుతిన్‌పై ఒత్తిడి తీసుకురావాలని అమెరికా భావిస్తోంది. రష్యా చమురులో 70 శాతం‌ను భారత్, చైనా వంటి దేశాలే కొనుగోలు చేస్తున్నాయని గ్రాహం తెలిపారు. వారు రష్యాకు మద్దతు ఇవ్వకుండా అడ్డుకునేందుకు అధ్యక్షుడికి శక్తివంతమైన సాధనంగా ఈ బిల్లు ఉపయోగపడుతుందన్నారు.

చివరి నిర్ణయం ట్రంప్ చేతిలో
ఈ బిల్లు అమలుపై తుది నిర్ణయం అధ్యక్షుడిదే. జూలై విరామం తర్వాత బిల్లును ఆమోదించి, అధ్యక్షుడికి చట్టబద్ధంగా అధికారం ఇవ్వనున్నట్లు గ్రాహం వెల్లడించారు. మార్చిలో ఈ బిల్లును ప్రతిపాదించినప్పటికీ, అప్పట్లో శ్వేతసౌధం నుంచి వ్యతిరేకత రావడంతో వాయిదా పడింది.

భారత్‌పై ప్రభావం ఎలా ఉంటుంది?
రష్యా చమురును తక్కువ ధరకే భారీగా దిగుమతి చేసుకుంటున్న భారత్‌పై ఈ బిల్లు ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రస్తుతం భారత్ దిగుమతి చేసే చమూరులో 40% పైగా రష్యా చమురే ఉంది. ఒకవేళ ఈ బిల్లు చట్టంగా మారితే, అమెరికాకు ఎగుమతించే భారత ఉత్పత్తులపై భారీ సుంకాలు పడతాయి. దీని ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ఉండే ప్రమాదం ఉంది. అయితే, భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం చర్చల దశలో ఉండటం కొంత ఊరట కలిగించొచ్చు.

రష్యా స్పందన
ఈ బిల్లుపై రష్యా సైతం ఘాటుగా స్పందించింది. “లిండ్సే గ్రాహం ఒక కఠిన రష్యా వ్యతిరేకి. ఇలాంటి చర్యలు ఉక్రెయిన్ యుద్ధానికి పరిష్కారం కాదు” అంటూ క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ విమర్శించారు.

ఈ పరిణామాలు భవిష్యత్‌లో అంతర్జాతీయ వాణిజ్య, రాజకీయ సంబంధాలపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశముంది.

Read More : ఎలాన్ మస్క్‌పై ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు: