హిమాచల్ ప్రదేశ్‌ను భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. కుండపోత వర్షాల కారణంగా సంభవించిన వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో ఇప్పటివరకు 10 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 34 మంది గల్లంతయ్యారు. ముఖ్యంగా మండి జిల్లా పరిస్థితి అత్యంత విషమంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గత 32 గంటల్లో 332 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మండి జిల్లాలో సోమవారం సాయంత్రం నుంచి రికార్డు స్థాయిలో 253.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో నిన్నటిదాకా 11 క్లౌడ్‌బర్స్ట్‌లు, నాలుగు ఆకస్మిక వరదలు, ఒక భారీ కొండచరియ విరిగిపడిన ఘటనలు నమోదయ్యాయి. ఇందులో ఎక్కువశాతం ఘటనలు మండి జిల్లాలోనే సంభవించాయి.
వర్ష బీభత్సం కారణంగా వందలాది రహదారులు మూసుకుపోయాయి, విద్యుత్ సరఫరా పూర్తిగా స్తంభించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 406 రహదారులు మూసుకుపోయాయి. వాటిలో 248 రహదారులు ఒక్క మండి జిల్లాలోనే ఉన్నాయి. 994 ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతినడంతో విద్యుత్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గోహర్, కర్సోగ్, థునాగ్ ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. మండి జిల్లాలో 316 మందిని, హమీర్‌పూర్‌లో 51 మందిని, చంబాలో ముగ్గురిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పటివరకు 24 ఇళ్లు, 12 పశువుల షెడ్డులు, ఒక వంతెన పూర్తిగా ధ్వంసమయ్యాయి. 30 పశువులు మృత్యువాత పడ్డాయి.
పాండో డ్యామ్ నీటిమట్టం 2,922 అడుగులకు చేరడంతో లక్షన్నర క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఛండీగఢ్-మనాలి జాతీయ రహదారి పలుచోట్ల మూసుకుపోయింది. హమీర్‌పూర్‌లోని బల్లా గ్రామంలో బియాస్ నది ఉప్పొంగడంతో 51 మందిని రక్షించారు. రుతుపవనాల ప్రారంభం (జూన్ 20) నుంచి ఇప్పటివరకు రాష్ట్రానికి దాదాపు రూ. 500 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లిందని సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు తెలిపారు. ప్రజలు నదులు, వాగుల ప్రాంతాలకు వెళ్లవద్దని హెచ్చరించారు. వాతావరణ శాఖ బుధవారం కాంగ్రా, సోలన్, సిర్మౌర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. జూలై 5 వరకు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో యెల్లో అలర్ట్ అమల్లో ఉంటుందని పేర్కొంది.
Read More : “ఐ లవ్ యూ” లైంగిక వేధింపు కాదు
