చైనా అధ్యక్షుడు బ్రిక్స్ సదస్సుకు దూరం

అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఈ వారం బ్రెజిల్‌లో జరగనున్న బ్రిక్స్ దేశాల వార్షిక సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ హాజరు కావడం లేదని అధికారికంగా వెల్లడైంది. గత 12 సంవత్సరాలలో ఆయన ఈ కీలక సమావేశాన్ని మిస్ చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. జిన్‌పింగ్‌ స్థానంలో చైనా ప్రధాని లీ కియాంగ్ ఈ సదస్సులో చైనా ప్రతినిధిగా పాల్గొంటారని చైనా విదేశాంగ శాఖ ప్రకటించింది. ఇటీవల జిన్‌పింగ్ కనబడకుండా పోయిన నేపథ్యంలో ఈ నిర్ణయం అనేక ఊహాగానాలకు దారితీస్తోంది. ఇక జులై 5 నుండి 8 వరకూ బ్రెజిల్‌లోని రియో డి జనీరో నగరంలో జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. గతేడాది రష్యాలో జరిగిన బ్రిక్స్ సదస్సులో మోదీ-జిన్‌పింగ్‌లు ముఖాముఖీగా భేటీ అయ్యారు. సరిహద్దు వివాదాల నేపథ్యంలో నాలుగేళ్ల అనంతరం జరిగిన ఆ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

ఆ భేటీలో కొన్ని ద్వైపాక్షిక సమస్యలపై చర్చ జరగడం వల్ల భారత్-చైనా సంబంధాల్లో స్వల్ప మెరుగుదల కనిపించిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే ఈసారి జిన్‌పింగ్ గైర్హాజరీతో మోదీ-జిన్‌పింగ్ భేటీకి అవకాశం లేకుండా పోయింది. వచ్చే నెలల్లో చైనాలో జరగనున్న ఎస్‌సీవో (షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్) సదస్సులో వీరిద్దరూ మళ్లీ కలవవచ్చని సమాచారం.

Read More : భారత్, చైనా ఉత్పత్తులపై 500% సుంకాలు?

One thought on “చైనా అధ్యక్షుడు బ్రిక్స్ సదస్సుకు దూరం

Comments are closed.