ఉదయ్‌పూర్ మార్బుల్ వ్యాపారుల కీలక నిర్ణయం

భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో, పాక్‌కు మద్దతు ప్రకటించిన టర్కీకి భారత్ నుంచి వ్యాపార పరంగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే పుణెలో టర్కీ యాపిల్స్ దిగుమతులు నిలిచిన వేళ, ఇప్పుడు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ మార్బుల్ వ్యాపారులు టర్కీ మార్బుల్ దిగుమతులను పూర్తిగా నిలిపివేయాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఉదయ్‌పూర్ మార్బుల్ ప్రాసెసర్స్ కమిటీ అధ్యక్షుడు కపిల్ సురానా వెల్లడించిన ప్రకారం, టర్కీకి వ్యతిరేకంగా తమ సంఘీభావం తెలుపుతూ ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న మార్బుల్ వ్యాపార సంస్థలు కూడా ఇదే మార్గాన్ని అనుసరించాలని కోరారు. ప్రస్తుతం భారత్ దిగుమతించే మార్బుల్‌లో 70 శాతంపైగా టర్కీ నుంచే వస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నిర్ణయం భారతీయ మార్బుల్ పరిశ్రమకు పునాది వేస్తుందని, దేశీయ తయారీదారులకు డిమాండ్ పెరుగుతుందని సురానా అభిప్రాయపడ్డారు. టర్కీకి వ్యతిరేకంగా ప్రారంభమైన ఈ ‘బోయ్‌కాట్’ ఉద్యమం ఇతర రంగాలకూ విస్తరించే అవకాశముందని పరిశీలకులు పేర్కొంటున్నారు.

ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో భేటీ కావడంతో పాటు, డ్రోన్ల రూపంలో సైనిక సాయం అందించాడన్న ఆరోపణలు వస్తున్నాయి. భారత్ కూల్చిన డ్రోన్లలో టర్కీ తయారీ ‘అసిస్ గార్డ్ సోంగర్’ శకలాలు లభించడంతో ఈ ఆరోపణలకు బలం చేకూరింది.

ఈ పరిణామాలన్నీ కలిసి భారత్‌లో టర్కీ వ్యతిరేకత పెరుగుతున్నదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Read More : రాష్ట్రపతిని కలిసిన త్రివిధ దళాధిపతులు

One thought on “ఉదయ్‌పూర్ మార్బుల్ వ్యాపారుల కీలక నిర్ణయం

Comments are closed.