టీఎస్ఆర్టీసీ సమస్యలపై చర్చలకు సిద్ధమైన ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కార్మికుల సమస్యలు చర్చల ద్వారా పరిష్కరించేందుకు తాము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని తెలిపారు.

హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు మంత్రిని కలసి సమస్యలు, డిమాండ్లు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తాను మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్టీసీ కార్మికుల సమస్యలు వినేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు.

ఆర్టీసీ పరిరక్షణ, కార్మిక సంక్షేమం, ప్రయాణికులకు మెరుగైన సేవలే తమ ప్రభుత్వ ప్రాధాన్యాలని మంత్రి తెలిపారు. ప్రస్తుతం సంస్థ నష్టాల నుంచి బయటపడుతుండగా, ఇలాంటి సమయంలో సమ్మెకు దిగడం సంస్థకే ముప్పుగా మారుతుందని హెచ్చరించారు.

గత పదిేళ్ల పాలనలో మాజీ ప్రభుత్వం సంస్థను తీవ్రంగా దెబ్బతీసిందని, కొత్త బస్సులు కొనకపోవడంతో పాటు ఉద్యోగ నియామకాలు కూడా జరగలేదని మంత్రి మండిపడ్డారు. అంతేకాక, సీసీఎస్, పీఎఫ్ నిధులను కూడా వాడేసినట్లు తెలిపారు.

ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, బాండ్ రూపంలో రూ.400 కోట్లు, పెండింగ్‌లో ఉన్న పీఎఫ్ బకాయిలకు రూ.1,039 కోట్లు, సీసీఎస్ బకాయిలకు రూ.345 కోట్లు చెల్లించామని పేర్కొన్నారు. అలాగే 1,500 మందికి కారుణ్య నియామకాలు పూర్తిచేయడంతో పాటు, కొత్తగా 3,038 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చినట్లు వెల్లడించారు.

ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పని చేస్తోందని, కార్మికులు సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.

Read More : హైదరాబాద్‌లో దారుణం