అమెరికా టెక్సాస్‌ను ముంచెత్తిన వరదలు

అమెరికా టెక్సాస్ రాష్ట్రంలో కుండపోత వర్షాలు ప్రకృతి విలయ తాండవానికి దారితీశాయి. గతకొద్ది రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది. ఈ జలప్రళయంలో ఇప్పటివరకు 24 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ధృవీకరించారు. టెక్సాస్‌లోని హంట్ ప్రాంతంలో ప్రవహించే గ్వాడాలుపే నది కుండపోత వర్షాల నేపథ్యంలో ఉద్ధృతంగా ప్రవహిస్తూ తీర ప్రాంతాలను ముంచెత్తింది. ఈ ప్రవాహంలో ఒక ప్రముఖ క్రిస్టియన్ సమ్మర్ క్యాంప్ పూర్తిగా నీట మునిగింది. వేసవి శిక్షణ శిబిరం కోసం క్యాంపుకు వచ్చిన 23 నుండి 25 మంది బాలికలు వరదలో గల్లంతైనట్లు సమాచారం. తమ పిల్లల ఆచూకీ తెలియక తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారుల ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ సహాయం కోసం పిలుపునిస్తున్నారు. సహాయక బృందాలు హెలికాప్టర్లు, పడవల సహాయంతో గల్లంతైన బాలికల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. ఇప్పటివరకు 200 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. నదుల ఉద్ధృతి, వర్షం ఇంకా కొనసాగుతుండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి.

టెక్సాస్‌లోని అనేక లోతట్టు ప్రాంతాలు నీట మునిగినట్లు అధికారులు వెల్లడించారు. వందలాది నివాసాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు.

Read More : పాకిస్థాన్‌కి మైక్రోసాఫ్ట్ షాక్

One thought on “అమెరికా టెక్సాస్‌ను ముంచెత్తిన వరదలు

Comments are closed.